Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రానున్న మూడు రోజుల్లో పోలింగ్ జరుగనున్న తరుణంలో బెంగుళూరు లోని ఓ అపార్ట్మెంట్లో గుట్టలకొద్దీ ఓటర్ ఐడీ కార్డులు బయటపడిన వ్యవహారం కర్ణాటకలో కలకలానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ మంగళవారం వేలాది ఓటరు గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకుంది. అయితే ఈ విషయంలో తొలుత జేడీఎస్ – కాంగ్రెస్ నేతల మధ్య ఇష్యూ అనుకుంటుండగా మరో కొత్త విషయం తెర మీదకి వచ్చింది.
రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జేడీఎస్ అభ్యర్థి జీ హెచ్ రామచంద్ర కుమారుడు జగదీశ్ ఈ వ్యవహారాన్ని బయటపెట్టారు. అందునా కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న అభ్యర్ధి ఫోటోలు ఉండడంతో ఈ పని కాంగ్రెస్ నేతలే చేశారని వారు ఆరోపించారు. జేడీఎస్ అధినాయకుడు దేవేగౌడ కూడా వచ్చి సదరు ఫ్లాట్ ని పరిశీలించడంతో విషయం కాస్త సీరియస్ అయ్యింది. అయితే ఈ ఐడీ కార్డులు ఉన్న ఫ్లాట్ యజమానురాలు మంజుల నంజమారి బీజేపీ తరపున కార్పొరేటర్‌గా గెలిచారని, ఆమె కుమారుడు శ్రీధర్ కూడా బీజేపీ కార్యకర్తేనని కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది.
అయితే కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ మాత్రం మంజుల ఎవరో తమకి తెలియదని ఆమెకు బీజేపీతో సంబంధాలు లేవన్నారు. బీజేపీపై పస లేని ఆరోపణలు చేస్తున్నారని జవదేకర్ పేర్కొన్నారు. అయితే సదరు ఫ్లాట్ ఓనర్ శ్రీధర్ మాత్రం మీడియాతో మాట్లాడుతూ తాము నూటికి నూరు శాతం బీజేపీ కార్యకర్తలమేనని, ఈ విషయంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఎందుకు అబద్ధం చెప్పారో తెలియడం లేదని, ఆయనకు తమ గురించి సరైన సమాచారం లేకపోయి ఉండవచ్చునని పేర్కొన్నారు. తమ ఫ్లాట్‌లో నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయన్న విషయంలో తమకు ఎవరి మీదా ఎటువంటి సందేహాలు లేవని తాము తమ ఫ్లాట్‌ను రాకేశ్‌కు రెండు నెలల క్రితం అద్దెకు ఇచ్చామని తెలిపారు. అయితే తన తల్లి మంజుల ఆరోగ్యం సహకరించకపోవడంతో కొద్ది రోజులుగా చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనడం లేదన్నారు. అయితే ఈ నకిలీ ఓటర్ కార్డులు కాంగ్రెస్ వా, లేక బీజేపీ వా లేక జేడీఎస్ వా అనేది పోలిసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.