ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వైసీపీలోకి నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి పలువురు నేతలు జగన్ గూటిలో చేరిపోయారు. అటు కాంగ్రెస్, బీజేపీకి చెందిన కొందరు నాయకులు కూడా జగన్ పార్టీలో చేరేందుకు సిద్దం అవుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ఆ పార్టీని వీడి వైసీపీలో చేరేందుకు సిద్ధయ్యారని సమాచారం. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో ఆమె సమావేశం కానున్నారు. అనంతరం వైసీపీలో చేరనునున్నట్లు సమాచారం. కాగా, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ కిల్లి కృపారాణి 2004, 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. 2004లో ఓటమి చెందగా 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటికే శ్రీకాకుళం నుంచి 4 సార్లు ఎంపీగా గెలిచిన ఎర్రనాయుడిని ఓడించి సంచలనం సృష్టించారు.
ఈ ఒక్క దెబ్బతో ఆమె కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిని ఆకర్షించిఅనంతరం కేంద్ర మంత్రి వర్గంలో ఐటీ, కమ్యునికేషన్స్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఐతే రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఎర్రనాయుడి తనయుడు రామ్మోహన్ నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుండే ఆమె వైసీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటే కిల్లీ సైతం వైసీపీలో చేరతారని అప్పట్లో పుకార్లు వినిపించాయి. కానీ అది జరగలేదు. ఇక ఇటీవల జగన్ ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురం సభలో కిల్లి కృపారాణి జగన్ పార్టీ గూటికి చేరతారని ఊహాగానాలు వచ్చాయి. కానీ అప్పుడు కూడా ఆమె మౌనం వీడలేదు. ఐతే ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో, ఇతర పార్టీలకు చెందిన వైసీపీలోకి క్యూకడుతున్న నేపథ్యంలో అమె కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆమెకు శ్రీకాకుళం పార్లమెంట్ సీటు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.