Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రపంచంలో ప్రస్తుతం అత్యుత్తమ బ్యాట్స్ మెన్ పేర్లు చెప్పమంటే..మొదటగా వినిపించేది భారత కెప్టెన్ విరాట్ కోహ్లీనే. సాధారణంగా ఏ ఆటగాడైనా మొదట తన ఆటతీరుతో ప్రతిభ చూపి…తద్వారా కెప్టెన్సీ దక్కించుకుంటారు. అయితే కెప్టెన్ అయిన తరువాత…వారి ఆట స్థాయి పడిపోతుంది. కెప్టెన్సీ భారం ఆటతీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే కెప్టెన్ గా సక్సెస్ అవుతారు కానీ…బ్యాట్స్ మెన్ గా పరుగులు రాబట్టలేకపోతుంటారు. భారత జట్టులో అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్స్ గా పేరు తెచ్చుకున్న సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోనీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. వారిద్దరూ కెప్టెన్ గా ఎంపికయిన తరువాత…స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయారని గణాంకాలు చూస్తే అర్ధమవుతుంది. అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఇందుకు మినహాయింపు. కెప్టెన్సీ స్వీకరించిన తరువాత కోహ్లీ మరింతగా విజృంభిస్తున్నాడు.
వన్డేలు, టీ20లు అన్న తేడా లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో క్రికెట్ అభిమానులు కోహ్లీ జపంచేస్తున్నారు. మరోపక్క …కోహ్లీని తమ ప్రకటనల్లో నటింపచేసుకునేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. అందుకే విరాట్ బ్రాండ్ వాల్యూ అంతకంతకూ పెరుగుతోంది. మనదేశంలో క్రికెట్ ఆటే నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నా..ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అందుకే ఫుట్ బాల్ క్రీడాకారులు టాప్ మోస్ట్ సెలబ్రిటీ జాబితాలో ఉండడమే కాకుండా..వారి ఆదాయం కూడా కోట్లల్లో ఉంటుంది. సగటు క్రికెటర్ ఆదాయానికి, ఫుట్ బాల్ క్రీడాకారుడి సంపాదనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అలాంటిది కోహ్లీ బ్రాండ్ విలువలో వాళ్లను దాటిపోతున్నాడు. ఫోర్బ్స్ తాజాగా ప్రకటించిన ప్రపంచంలోనే అత్యంత విలువైన అథ్లెట్ల టాప్ టెన్ జాబితాలో కోహ్లీ ఏడో స్థానంలో నిలిచాడు.
ఈ విషయంలో కోహ్లీ…ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని దాటేశాడు. 14.5 మిలియన్ డాలర్లతో కోహ్లీ ఏడో స్థానంలో ఉంటే…మెస్సీ 13.5 మిలియన్ డాలర్లతో 9వ స్థానంలో నిలిచాడు. ప్రచార ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఫోర్బ్స్ ఈ జాబితా రూపొందించింది. ఆటకు సంబంధించిన జీతాలు, బోనస్, పెట్టుబడుల ద్వారా వచ్చే డబ్బును ఇందులో కలపలేదు. టాప్ 10 జాబితాలో క్రికెట్ నుంచి చోటుదక్కించుకున్న ఏకైక ఆటగాడు కోహ్లీనే. 37.2 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఈ జాబితాలో స్విటర్జాండ్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ అగ్రస్థానంలో నిలిచాడు. తర్వాతి స్థానాల్లో బాస్కెట్ బాల్ ఆటగాడు లిబ్రాన్ జేమ్స్, స్ప్రింటర్ ఉసేన్ బోల్డ్, ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో, గోల్ఫ్ ఆటగాళ్లు ఫిల్ మెకల్ సన్, టైగర్ ఉడ్ ఉన్నారు. మొత్తానికి కోహ్లీ బ్రాండ్ విలువలో అంతర్జాతీయ అథ్లెట్లను వెనక్కినెట్టేస్తున్నాడు. కోహ్లీ ఇదే ఆటతీరు ఇంకొన్నాళ్లు కొనసాగిస్తే..ఆయన బ్రాండ్ విలువ క్రిస్టియానో రొనాల్డోను మించిపోయినా ఆశ్చర్యంలేదు.