నీట్ కు వ్య‌తిరేకంగా పోరాడిన అనిత ఆత్మ‌హ‌త్య

girl-dies-will-tamil-nadu-due-to-neet-exam

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెడిస‌న్ చ‌దువుకు నీట్ త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ఓ విద్యార్థిని ప్రాణాలు బ‌లితీసుకుంది.  నీట్ కు వ్య‌తిరేకంగా న్యాయ‌పోరాటం చేసినా ఫ‌లితం లేక‌పోవ‌టంతో త‌మిళ‌నాడుకు చెందిన అనిత అనే ద‌ళిత విద్యార్థిని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. అనిత నీట్ ప‌రీక్ష‌కు వ్య‌తిరేకంగా సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసింది. ఈ పిటీష‌న్ ను సుప్రీంకోర్టు ఇటీవ‌ల కొట్టివేయ‌టంతో మ‌న‌స్తాపానికి గురైన అనిత త‌న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. 17 ఏళ్ల అనిత త‌మిళ‌నాడు బోర్డు ప‌రిధిలో చ‌దువుకుంది. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో 1200 మార్కుల‌కు గానూ 1176 మార్కులు తెచ్చుకుంది. వైద్య విద్య కోసం త‌మిళ‌నాడు నిర్వ‌హించిన ఎంట్ర‌న్స్ లో ఆమెకు 196.25 మార్కులు వ‌చ్చాయి.  కానీ నీట్ ప‌రీక్ష‌లో మాత్రం 76 మార్కులే వ‌చ్చాయి.
ఈ మార్కుల‌తో ఆమెకు  మెడిస‌న్ లో సీటు ల‌భించ‌లేదు. ఇంట‌ర్ లోనూ, త‌ర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించిన ఎంట్ర‌న్స్ లోనూ అత్యుత్త‌మ మార్కులు తెచ్చుకున్న అనిత నీట్ కార‌ణంగా వైద్య‌విద్య చ‌దివే అవ‌కాశం కోల్పోయింది. మెడిస‌న్ కు నీట్ త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్రప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో ఆమె ఇన్నేళ్ల క‌ష్టం వృథా అయింది.  దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. నీట్ ప‌రీక్ష వ‌ల్ల త‌న‌లాంటి విద్యార్థులెంద‌రో న‌ష్ట‌పోతున్నార‌ని పిటిష‌న్ లో వెల్ల‌డించింది. నీట్ ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరింది. కానీ అనిత వాద‌నను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ పిటీష‌న్‌ను కొట్టివేసింది. సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫ‌లితం లేక‌పోవ‌టంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌యిన అనిత ఆత్మ‌హ‌త్య‌కు ఒడిగ‌ట్టింది. త‌మిళ‌నాడులో 40వ‌ర‌కు ఉన్న మెడిక‌ల్ కాలేజీల్లో సీట్ల భ‌ర్తీకి ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టిదాకా ప్ర‌త్యేకంగా ఎంట్ర‌న్స్ నిర్వ‌హించేది.
 
ఒక్క త‌మిళ‌నాడులోనే కాదు…దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇంజ‌నీరింగ్‌, మెడిస‌న్ కు ఆయా రాష్ట్రాలు ప్ర‌త్యేక ఎంట్ర‌న్స్ నిర్వ‌హిస్తున్నాయి. కేంద్రం నిర్ణ‌యంతో దేశంలో వైద్య విద్య చ‌ద‌వాల‌నుకునే విద్యార్థులంద‌రూ నీట్ రాయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాతృభాష‌ల్లో చదువుకున్న విద్యార్థులు జాతీయ‌స్థాయి ప్ర‌వేశ‌ప‌రీక్ష‌లో పోటీప‌డటం చాలా క‌ష్ట‌మ‌ని విద్యానిపుణులు వాదిస్తున్నారు. ఆర్థిక‌ప‌రిస్థితులు అంతంత‌మాత్రంగా ఉండే కుటుంబాల నుంచి వ‌చ్చిన విద్యార్థులు నీట్ లో అర్హ‌త సాధించ‌టానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకోలేక‌పోతున్నారు. దీంతో వారంతా న‌ష్ట‌పోతున్నారు. అటు అనిత ఆత్మ‌హ‌త్య నేప‌థ్యంలో త‌మిళ‌నాడులో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 1500 మందికి పైగా విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు చెన్నైతోపాటు రాష్ట్రంలోని అనేక‌ప్రాంతాల్లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చేస్తున్నారు. త‌మిళ‌నాడు విద్యార్థుల‌కు నీట్ నుంచి మిన‌హాయింపు తెచ్చుకోవ‌డంలో రాష్ట్ర‌ప‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మ‌యింద‌ని వారు ఆరోపిస్తున్నారు.