Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు యావత్ భారత దేశంలో ఏ మూలకి వెళ్లి ఏ చిన్న పిల్లవాడిని అడిగినా …ప్రధాని మోడీకి కాంగ్రెస్ తరువాత అంతటి శత్రువు ఎవరంటే చంద్రబాబు అని చెబుతారు. ఇక ఆంధ్రాలో అయితే బీజేపీ , టీడీపీ నాయకులు ఎలా కత్తులు నూరుకుంటున్నారో ఎవరిని అడిగినా కధలుకధలుగా చెబుతారు. టీడీపీ ,బీజేపీ ల మధ్య బద్ధ శత్రుత్వం నడుస్తోందని లోకమంతా కోడై కూస్తున్నా ఒక్కరికి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఆ ఒక్కరే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇంతకీ ఇదేదో ఆషామాషీగా చెప్పిన మాట కాదు. ఆంధ్రాకి ప్రత్యేక హోదా డిమాండ్ తో ఎంపీ లతో రాజీనామా చేయించిన జగన్ అవి ఎందుకు ఆమోదం పొందడం లేదని వస్తున్న విమర్శలకి సమాధానం ఇవ్వలేక నేరుగా చంద్రబాబుని సీన్ లోకి లాగేసారు. చంద్రబాబు చెప్పడం వల్లే తమ ఎంపీల రాజీనామాలు ఆమోదించకుండా బీజేపీ కాలయాపన చేస్తోందని జగన్ ఆరోపించారు. బీజేపీ , టీడీపీ మధ్య ఫ్రెండ్ షిప్ వల్లే వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందడం లేదని జగన్ చేస్తున్న వాదనతో అంతా విస్తుపోతున్నారు. రాజకీయాలు చెడిపోయాయి అని తెలుసు కానీ మరీ ఇంత నిర్లజ్జగా అబద్ధాలు చెప్పే నాయకులు వస్తారని ఎవరూ అనుకోని వుండరు.
ఇప్పటికే బీజేపీ తో లోపాయికారీ సంబంధాల వల్ల పార్టీ వోట్ బ్యాంకు దెబ్బ తింటుందని వాపోతున్న ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు జగన్ కామెంట్స్ తో షాక్ అయ్యారంట. అప్పటికి కాస్త మౌనంగా ఉన్నప్పటికీ జనం మరీ అమాయకులని జగన్ అనుకుంటున్నారని , ఇలాంటి కామెంట్స్ కి ఫలితం వచ్చే ఎన్నికల్లో అనుభవించాల్సి వస్తుందని కనిపించిన వాళ్ళు అందరితో చెబుతున్నారట. పనిలో పనిగా వైసీపీ కి గుడ్ బై కొట్టేందుకు గోదావరి జిల్లాలకు చెందిన ఆ సీనియర్ నాయకుడు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు పక్కా సమాచారం అందుతోంది.