Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఇద్దరు సాధ్విలపై అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 25న హర్యానా లోని పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు గుర్మీత్ ను దోషిగా తేల్చింది. ఈ విషయం తెలిస్తే వేలసంఖ్యలో ఉన్న ఆయన అనుచరులు చెలరేగిపోతారని అంచనా వేసిన హర్యానా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. విద్యుత్, ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేసింది. అయినా సరే గుర్మీత్ దోషిగా ఖరారయిన విషయం ఆయన అనుచరులు తెలుసుకుని విధ్వంసం సృష్టించారు. ప్రసార సాధనాలేవీ అందుబాటులో లేకపోయినా…వారికి ఈ విషయం అంత వేగంగా ఎలా తెలిసిందనేది అందరి సందేహం. దీనికి హర్యానా పోలీసులు సమాధానం చెప్పారు. తాను దోషిగా నిర్ధారణ అయినట్టుగా తన అనుచరులకు ఓ ఎర్రబ్యాగ్ ద్వారా గుర్మీత్ సంకేతం ఇచ్చారని పోలీసులు తెలిపారు. పంచకుల సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే గుర్మీత్ ను కోర్టు వెలుపలికి తీసుకువచ్చారు. వెంటనే గుర్మీత్ తన ఎర్రబ్యాగును ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందులో తన దుస్తులు ఉన్నాయని, సిర్సా నుంచి ఆ బ్యాగును తెచ్చుకున్నానని చెప్పాడు.
గుర్మీత్ కారు నుంచి ఆ బ్యాగు తీసి అతనికి ఇచ్చిన కొన్ని క్షణాలకే అక్కడకు కాస్త దూరంలో పేలుడు శబ్దాలు వినిపించటంతో పోలీసులకు విషయం అర్దమయింది. తనను సీబీఐ కోర్టు దోషిగా తేల్చిందని అనుచరులు తెలుసుకోటానికి గుర్తుగా బాబా ఆ బ్యాగును పట్టుకున్నాడని గ్రహించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. దోషిగా నిర్ధారిస్తే…కోర్టు హాలు నుంచి తప్పించుకుని వెళ్లాలన్నది కూడా డేరా బాబా ఆలో్చన. కో్ర్టు నుంచి బయటకు వచ్చాక వాహనంలో కూర్చోకుండా చేతిలో బ్యాగు పట్టుకుని కొంత సేపు బాబా కారిడార్లో తిరుగుతూ కనిపించాడు. దీని వల్ల అనుచరులకు విషయం తెలిసి, వారు అల్లర్లు సృష్టించి, తనను అక్కడి నుంచి తప్పిస్తారన్నది బాబా ఆలోచన. అయితే పరిస్థితిని అర్ధం చేసుకున్న పోలీసులు బాబాను తక్షణమే అక్కడి నుంచి తీసుకెళ్లాలని నిర్ణయించారు. రోడ్డు మార్గమంతా బాబా అనుచరులు కాపు వేసుకుని ఉండటంతో బాబాను హెలికాప్టర్ లో జైలుకు తీసుకువెళ్లాలని భావించారు. అక్కడ కూడా వారికి సమస్య ఎదురయింది. గుర్మీత్ ను హెలిపాడ్ కు తీసుకెళ్లే దారిలో ఆయన అనుచరులు 70 వాహనాల్లో వేచి ఉన్నారు. దీంతో ప్రమాదాన్ని ఊహించిన పోలీసులు అప్పటికప్పుడు మార్గాన్ని మార్చివేశారు.
ఆర్మీ అనుమతితో కంటోన్మెంట్ మీదగా గుర్మీత్ ను హెలిప్యాడ్ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం రోహ్ తక్ జైలుకు తరలించారు. దోషిగా నిర్ధారణ అయితే కోర్టు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలన్నది డేరా బాబా ప్లాన్. . రోడ్డు మార్గంలోనే కాక హెలిపాడ్ కు వెళ్లేదారిలోనూ 70 వాహనాల్లో ఆయన అనుచరులు ఉన్నారంటే ఆయన పన్నాగం ఏ స్థాయిలో్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితేనీ బాబా ఎర్రబ్యాగుతో ఎన్ని సంకేతాలు ఇచ్చినా….హర్యానా పోలీసులు ఆయన ఆటలు సాగనీయకుండా పకడ్బందీగా వ్యవహరించి కటకటాల వెనక్కి తోసేశారు. ఎలాగైనా తప్పించుకోగలనన్నధీమాతో ఉండటం వల్లే దోషిగా నిర్ధారణ అయిన రోజు బాబా పెద్దగా ఆందోళన పడినట్టుకనిపించలేదు. కానీ శిక్ష ఖరారయిన రోజు మాత్రం కోర్టుహాల్లో దీనంగా విలపించాడు.
మరిన్ని వార్తలు: