Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బిగ్‌బాస్ ముందు వరకు ఒక సాదా సీదా యాంకర్‌గా, ఒక చిన్న సహాయ నటిగా మాత్రమే హరితేజకు గుర్తింపు ఉంది. కాని బిగ్‌బాస్ సీజన్ 1లో ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పుడే ఆమె స్టార్‌డం పెరిగి పోయింది. చివరి నాలుగు అయిదు వారాల్లో హరితేజ కనబర్చిన ఎనర్జీ తెలుగు రాష్ట్రాల ప్రజకు బాగా నచ్చింది. హరితేజలో ఇంత ప్రతిభ ఉందా అని అంతా అవాక్కయ్యారు. బిగ్‌బాస్ విజేతగా నిలవలేక పోయినా కూడా ప్రేక్షకుల హృదయాలను మాత్రం గెలుచుకుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బిగ్‌బాస్ పూర్తి అయిన తర్వాత హరితేజకు మంచి ఆఫర్లు వస్తాయని అంతా భావించారు. అన్నట్లుగానే హరితేజకు మంచి ఆఫర్లు వస్తున్నాయి.
బిగ్‌బాస్‌లో కనబర్చిన ప్రతిభకు మల్లెమాల శ్యామ్‌ప్రసాద్ రెడ్డి ఫిదా అయ్యి తన కామెడీ షో జబర్దస్త్ యాంకర్‌గా ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరిగింది. రష్మీ స్థానంలో హరితేజను ఎంపిక చేసి, అనసూయను అలాగే కొనసాగించనున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలు నిజం కాదని హరితేజ క్లారిటీ ఇచ్చింది. తనను మల్లెమాల వారు సంప్రదించిన విషయం వాస్తవమే. కాని జబర్దస్త్ కోసం మాత్రం కాదని ఆమె చెప్పుకొచ్చింది. మరి ఏ షో కోసం సంప్రదించారు అనే విషయాన్ని చెప్పలేదు. మల్లెమాల పలు రియాల్టీ షోలను ప్లాన్ చేస్తుంది. అందులో కొత్తగా చేయబోతున్న షోకు హరితేజను సంప్రదించి ఉంటారని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
హరితేజ ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లు ఏమీ ఒప్పుకోలేదు. సినిమాల్లో మరియు బుల్లి తెరపై ఆఫర్లు బాగానే ఉన్నాయి. అయితే వేటిని ఒప్పుకోవాలని ఆమె నిర్ణయించుకోలేక పోతుంది. అందుకే కాస్త గ్యాప్ తీసుకుంటుంది. మల్లెమాల వారికి కూడా హరితేజ హామీ ఇవ్వలేదని, త్వరలోనే తన నిర్ణయాన్ని చెబుతాను అని సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి హరితేజను కొత్తగా బుల్లి తెరపై చూడబోతున్నాం అనిపిస్తుంది. బుల్లి తెరపై కనిపించకుంటే వెండి తెరపై ఆమె మెరిసే అవకాశం ఉంది.