సినీ నటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ ఈరోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే హరికృష్ణ అంత్యక్రియలు మొయినాబాద్ ప్రాంతంలోని ఫామ్ హౌస్ లో జరగనున్నాయని తొలుత వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు జరగడం లేదు. నందమూరి ఫ్యామిలీ కోరిక మేరకు జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ మీడియాకు తెలిపారు.
రేపు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య అంత్యక్రియలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మెహిదీపట్నంలోని హరికృష్ణ నివాసం నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనుంది. ఆయన అంతిమయాత్ర కోసం చైతన్య రథం సిద్ధమవుతోంది. ఈ మేరకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మీడియాకు ప్రకటన ఇచ్చారు. అంతకు ముందు హరికృష్ణ అంత్యక్రియల ఏర్పాట్ల గురించి ఆయన కుటుంబసభ్యులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో కేటీఆర్ మాట్లాడారు.