Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రైవేట్ పాల డైరీలు కల్తీ పాలు అమ్ముతున్నాయంటూ సాక్షాత్తు ఓ రాష్ట్ర మంత్రి గొంతు ఎత్తడంతో హెరిటేజ్ సంస్థకి ఇబ్బంది ఎదురైంది. అయితే ఆ వ్యవహారం చివరకు హెరిటేజ్ ప్రమేయం లేకుండానే క్లీన్ చిట్ తో ముగిసింది. అలా మాట్లాడిన మంత్రికి కోర్టు హెచ్చరికలు కూడా చేయడంతో ఆ ఎపిసోడ్ ముగిసింది.
తమిళనాడు పాడిపరిశ్రమ శాఖ మంత్రి రాజేంద్ర బాలాజీ ప్రభుత్వ డైరీ పాల అమకాల్ని పెంచడం కోసం ప్రైవేట్ డైరీల్ని టార్గెట్ చేశారు. ప్రైవేట్ డైరీలు కల్తీ, రసాయనాలు కలిపిన పాలు అమ్ముతున్నాయని ఆయన ఆరోపించారు. దీంతో ప్రైవేట్ డైరీలు ఉలిక్కిపడ్డాయి. తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో భారీ మార్కెట్ వున్న హెరిటేజ్ కూడా మంత్రిని ఢీకొట్టడానికి ఇబ్బందిపడింది. అయితే ఆ సంస్థ తరపున నారా బ్రాహ్మణి చెన్నై వెళ్లి తన కుమారుడు దేవాన్ష్, మామ చంద్రబాబు సైతం హెరిటేజ్ పాలు తాగుతున్నారని చెప్పి వినియోగదారుల నమ్మకం పోకుండా చూసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన మంత్రి రాజేంద్ర బాలాజీ ప్రైవేట్ డైరీల పాల నాణ్యత తేల్చేందుకు వాటి సాంపిల్స్ పరీక్షకు పంపారు. ఆ పరీక్షల్లో పాల నాణ్యత బాగానే ఉందని నిర్ధారణకు వచ్చారు.
అయితే మంత్రి రాజేంద్ర బాలాజీ వైఖరితో తమ ఉత్పత్తులు మీద వినియోగదారుల్లో అపనమ్మకం ఏర్పడిందని మూడు ప్రైవేట్ డైరీలు కోర్టుని ఆశ్రయించాయి. హట్సాన్ ఆగ్రో, దొడ్ల డైరీ, విజయ డైరీ లు తమకు నిరాధార ఆరోపణలతో నష్టం కలిగించిన బాలాజీ ఒక్కొరికి కోటి రూపాయలు చెల్లించాలని కోర్టుకి విన్నవించుకున్నారు. ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ఇకపై నిరాధార ఆరోపణలు చేయడం తగదని కోర్టు మంత్రి తరపు న్యాయవాదిని హెచ్చరించింది. తదుపరి విచారణ ఇంకో 4 వారాలకు వాయిదా వేసింది. ఈ పరిణామంతో తమిళనాట హెరిటేజ్ తో పాటు మిగిలిన ప్రైవేట్ డైరీలకు ఊరట లభించింది. వాటి మార్కెటింగ్ కి అధికారికంగానే కాకుండా నైతికంగా కూడా మద్దతు దొరికినట్టు అయ్యింది.
మరిన్ని వార్తలు