పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై మరోసారి సర్జికల్ దాడులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. మూడు చోట్ల జరిగిన వైమానిక దాడుల్లో 300 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో అత్యవసరంగా ప్రధాని అధ్యక్షతన అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్, అరుణ్ జైట్లీ సహా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర అధికారులు హాజరయ్యారని సమాచారం. మరోవైపు, వైమానిక దాడుల నేపథ్యంలో గుజరాత్ డీజీపీ సమావేశం అర్ధాంతరంగా రద్దయ్యింది. పాకిస్థాన్ సరిహద్దుల్లోని అన్ని జిల్లాల్లోనూ హైఅలర్ట్ ప్రకటించారు.
అలాగే గుజరాత్ లోని జామ్‌నగర్, మాలియా, అహ్మదాబాద్, వడోదర వైమానిక స్థావరాల్లోను హైఅలర్ట్ ప్రకటించి, అవసరమైతే దాడులకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు అందడం సంచలనంగా మారింది. పాక్ వైమానిక దళం దాడులకు పాల్పడే అవకాశం ఉందని, దీనిని సమర్ధంగా ఎదుర్కొడానికి సిద్ధంగా ఉండాలంటూ అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి రక్షణ వ్యవస్థలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అప్రమత్తం చేయడంతో ఎక్కడికక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఐఏఎఫ్‌కి చెందిన ముందస్తు హెచ్చరికల విమానం ఈఎంబీ 145 సరిహద్దుల్లో మంగళవారం ఉదయం చక్కర్లు కొట్టినట్టు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లో గుర్తించారు. ఇదిలా ఉండగా అటు పాక్ సైతం అప్రమత్తమైంది. భద్రతపై సమీక్ష కోసం సమావేశం నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.