పుల్వామా దాడి వలన జరిగిన ప్రాణ నష్టం నుండి ఇంకా బయటపడకుండానే పుల్వామా తరహాలో మరోసారి దాడి చేసేందుకు జైషే ఏ మహ్మద్ ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు భద్రతా బలగాలను హెచ్చరించినట్లు తెలుస్తోంది. రానున్న రెండు రోజుల్లో జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు భారీ ఎత్తున ఆత్మాహుతి దాడులు, ఐఈడీ పేలుళ్లు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. అలాగే నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుదారులు ప్రవేశించే అవకాశం కూడా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జైషే ఏ మహ్మద్ ఉగ్రవాదులు సోషల్ మీడియాలో పంపించుకున్న సందేశాలను డీకోడ్ చేయడంతో ఈ విషయం బయటపడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ దఫా దాడి చేసేందుకు దాదాపు 500 కేజీల పేలుడు పదార్థాలను ఉపయోగించేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కశ్మీరీలను భద్రతా బలగాలు వేధించడం ఆపకపోతే దాడులు మరింత ఎక్కువ చేస్తామని సదరు ఉగ్రవాదులు హెచ్చరించినట్లు సమాచారం. ‘ఈ పోరాటం మీకు మాకు మధ్య. వచ్చి మాతో పోరాడండి. మేం సిద్ధంగా ఉన్నాం.
ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అంటూ ఉన్న ఓ సందేశాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు డీకోడ్ చేశాయి. అయితే మరోపక్క పుల్వామా దాడిని ఖండిస్తూ ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) సభ్య దేశాలు ఏకగ్రీవంగా చేసిన తీర్మానానికి చైనా కూడా మద్దతు తెలిపింది. ఈ దాడిని తీవ్రమైనదిగా, పిరికిపందల చర్యగా పేర్కొంటూ యూఎన్ఎస్‌సీ తీర్మానం చేసింది. ఈ దుశ్చర్య వెనుక కుట్రదారులను, నిర్వాహకులను, ఆర్ధికంగా సహకరించిన వారిని పట్టుకుని చట్టం ముందుకు తీసుకురావాలని పేర్కొంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం సహా సంబంధిత అధికారులకు అన్ని దేశాలు చురుగ్గా సహకరించాలని యూఎన్ఎస్‌సీ సూచించింది. తీవ్రవాద చర్యలకు ఎవరు ఉపక్రమించినా అది నేరమేననీ, దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని జైషే మహ్మద్ పేరును ప్రస్తావిస్తూ స్పష్టం చేసింది. దీంతో ఇన్నాళ్లూ చైనా అండతో తప్పించుకు తిరుగుతున్న మసూద్ అజర్‌కు ఇక కష్టాలు తప్పవని భావిస్తున్నారు.