Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓ మనిషికి అధికారం సొంతమయితే…దాని ద్వారా వచ్చే సుఖాలను పొందేందుకు చాలామంది ఆ మనిషి చుట్టూ చేరడం సహజం. స్నేహితులు, బంధువులే కాదు… మనస్పర్ధలు వచ్చి దూరమైన కుటుంబ సభ్యులు కూడా పాత సంగతులు మర్చిపోయి దగ్గరకు వస్తారు. ఇక ఆ వ్యక్తి వివాహ బంధాలు ఒకటికి మించి ఉంటే… ఆ వ్యక్తి ప్రస్తుత, మాజీ జీవిత భాగస్వామ్యులు ఒకరితో ఒకరు శత్రువుల మాదిరిగా పోటీపడతారు. ఇలాంటి విషయాలు సాధారణంగా మనదేశంలో కనిపిస్తుంటాయి. ఓ వ్యక్తి ఏదో కారణాలతో తన భార్యతో విడిపోయి మరో వివాహం చేసుకుంటే.. ఆ తర్వాత ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటే భర్త వద్దకు వచ్చేందుకు మాజీ భార్య ఆసక్తి చూపడం, ఇందుకోసం ప్రస్తుత భార్యతో గొడవలకు దిగడం వంటి ఘటనలు మన దగ్గర సర్వసాధారణం. కానీ విశాల దృక్పథంతో ఆలోచిస్తామని చెప్పుకునే పాశ్చాత్య దేశాలకు చెందిన మహిళలూ ఇందుకు మినహాయింపు కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ భార్య, ప్రస్తుత భార్యల మధ్య నడుస్తున్న గొడవలే ఇందుకు నిదర్శనం.
డొనాల్డ్ ట్రంప్ మొదట ఇవానా అనే మహిళను 1977లో వివాహం చేసుకున్నాడు. 15 ఏళ్ల పాటు సాగిన వారి వైవాహిక బంధం 1992లో ముగిసిపోయింది. ట్రంప్ కు మార్లా అనే మహిళతో ఉన్న వివాహేతర బంధం గురించి తెలుసుకున్న ఇవానా ఆయన నుంచి విడాకులు తీసుకుంది. తర్వాత ట్రంప్ మార్లాను పెళ్లిచేసుకున్నారు . కానీ వారి వివాహ బంధం కూడా కొనసాగలేదు. 1999లో మార్లా నుంచి విడాకులు తీసుకున్న ట్రంప్ 2005లో మెలానియాను వివాహం చేసుకున్నారు. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత మెలానియాకు అమెరికా ప్రథమ మహిళ హోదా లభించింది. ఈ హోదాపై ఇప్పుడు మెలానియాకు, మాజీ భార్య ఇవానాకు మధ్య వివాదం చెలరేగింది. ఇవానా ఇటీవలే రైజింగ్ ట్రంప్ పేరుతో ఓ పుస్తకం రాశారు. ట్రంప్ తో తన వైవాహికజీవితం, విడాకులు, పిల్లల్ని పెంచడం వంటి వివరాలను ఆ పుస్తకంలో వెల్లడించారు. త్వరలో ఈ పుస్తకం విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రథమ మహిళ హోదాకు తానే అర్హురాలినని, ట్రంప్ కు మొదటి భార్య అయిన తానే దేశానికి ప్రధమమహిళనని ఆమె అన్నారు. తాను శ్వేతసౌధానికి ఎప్పుడంటే అప్పుడు వెళ్లవచ్చని, కానీ తాను వెళ్లాలనుకోవడం లేదని, ఎందుకంటే అక్కడ మెలానియా ఉందని, తానెవరీకీ అసూయ కలిగించాలనుకోవడం లేదని ఇవానా వ్యాఖ్యానించారు. అంతేగాక మెలానియా వైట్ హౌస్ లో ఉండేందుకు చాలా కష్టపడుతోంది అని విమర్శించారు. ఇవానా వ్యాఖ్యాలపై మెలానియా అధికార ప్రతినిధి స్టీఫానీ గిష్రామ్ ప్రకటన విడుదల చేశారు. వైట్ హౌస్ లో ఉండడాన్ని మెలానియా ఎంతో ఇష్టపడుతున్నారని, ట్రంప్, ఆయన కుమారుడు బారెన్ కు మెలానియా శ్వేతసౌధాన్ని ఓ సొంతింటిగా తీర్చిదిద్దారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధమ మహిళగా తన బాధ్యతలను ఎంతో గౌరవిస్తున్నారని, ఈ హోదాతో చిన్నారుల సంరక్షణకు ఆమె కృషిచేస్తున్నారని, అంతేగానీ పుస్తకాలు అమ్ముకోడానికి కాదని విమర్శించారు. మొత్తానికి తెలుగు సీరియళ్లలో చూపించే సాధారణ మహిళలల్లానే అమెరికా అధ్యక్షుని భార్యలు కూడా భర్త కోసం బాహాబాహీకి దిగుతున్నారు.