తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తీవ్ర ఆర్థిక లోటుతో సతమతమవుతున్న నవ్యాంధ్ర త్వరగా కోలుకోవాలంటే పారిశ్రామిక ప్రగతితోనే సాధ్యం. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆహ్వానించే పనిని మొదలెట్టారు. ఇందులో భాగంగా తాను విదేశాలకు వెళ్లడంతో పాటుగా, పరిశ్రమల శాఖ అధికారులను బృందాలుగా ఆయా దేశాలకు పంపి ఏపీలో కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయన్న విషయాలను వివరించడం మొదలెట్టారు. ఈ ప్రక్రియ మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఇప్పటికే కొరియా కార్ల కంపెనీ కియా అనంతపురం జిల్లాలో తన ప్లాంటును ఏర్పాటు చేయగా, నెల్లూరు తిరపతి శ్రీ సిటీలో పదుల్ సంఖ్యలో కంపెనీలు నెలకొల్పబడ్డాయి. ఈ సమయంలో మరిన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా ఏపీకి వచ్చేందుకు అమితాసక్తి కనబరుస్తున్నాయి.
ఈ జాబితాలో ఇండోనేసియాకు చెందిన పేపర్ అండ్ పల్ప్ దిగ్గజం ఏసియా పల్ప్ అండ్ పేపర్ (ఏపీపీ) కూడా ఒకటి. మిగిలిన పరిశ్రమలను పక్కనపెడితే కాగిత పరిశ్రమలో ప్రపంచంలోనే పేరొందిన ఏపీపీ ఏపీలో తన యూనిట్ ను నెలకొల్పందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ ప్లాంట్ ఏర్పాటు ఖాయమే. ఏపీలోని ప్రకాశం జిల్లా రామాయపట్నం పరిసరాల్లో నెలకొల్పబోయే ఈ పరిశ్రమకు చాలా ప్రత్యేకతలున్నాయి. సాంతం తీర ప్రాంతంగా ఉన్న రామాయపట్నంలో ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 25 వేల ఎకరాల స్థలాన్ని ఏపీపీకి అందించనుంది. ఇక ఈ పరిశ్రమ కోసం ఏపీపీ పెడుతున్న పెట్టుబడి రూ.24,500 కోట్లు. పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా ఏర్పడుతున్న అతి పెద్ద పరిశ్రమగా ఈ ప్లాంటు రికార్డులకెక్కనుంది. ఇదిలా ఉంటే కాగిత పరిశ్రమలో ఏపీపీ వరల్డ్ జెయింట్ కాగా ఆ సంస్థకు చెందిన అతి పెద్ద వెంచర్ రామాయపట్నం ప్లాంటే కానుంది. ఇక ఈ పరిశ్రమతో రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉపాధి లభించనుంది.