జగన్ కు ఇది కూడా తెలియకపోవడం నిజంగా దురదృష్టం!: నారా లోకేశ్

It is really unfortunate that jagan do not even know this

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, దేశంలోనే మొదటిసారిగా విద్యుత్ సంస్కరణలు చేపట్టి, నష్టాల్లో ఉన్న సంస్థలను చంద్రబాబు గట్టెక్కించారని టీడీపీ నేత నారా లోకేశ్ తెలిపారు. చంద్రబాబు అలా దేశానికి ఆదర్శంగా నిలిస్తే, వైఎస్ రాజశేఖరరెడ్డి చంద్రబాబు కష్టాన్ని ఉచిత విద్యుత్ అంటూ సోకు చేసుకున్నారని విమర్శించారు. 2009 ఎన్నికలకు ముందు విద్యుత్ యూనిట్ ను రూ.16 లకు కొనిపించి డిస్కంలు రూ.6600 కోట్ల అప్పుల్లో కూరుకుపోయేలా చేసి దివాళా తీయించారని విమర్శించారు. ఇప్పుడు జగన్ గారు ధర్మల్ పవర్ చీప్ గా వస్తోంది కదా, వాడుకుందాం అని చెబుతున్నారనీ, ఆయన మాటలు వింటే నవ్వొస్తోందని వ్యాఖ్యానించారు. 2022 నాటికి 175 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పాదకతను దేశం లక్ష్యంగా పెట్టుకుందన్న విషయం జగన్ కు తెలియదా? అని ప్రశ్నించారు. ఈ విషయం ముఖ్యమంత్రికి తెలియకపోవడం నిజంగా దురదృష్టకరమని అన్నారు. ‘అయినా విద్యుత్ ను ఎక్కువ పెట్టి కొనేస్తున్నాం, ప్రజాధనం వృధా అయిపోతోంది అని సుద్దపూస కబుర్లు చెప్తున్న మీరు, కర్ణాటకలో మీ సొంత సండూర్ పవర్ సంస్థ HESCOMకు యూనిట్ విద్యుత్ ను రూ. 4.50కి ఎందుకు అమ్ముతుందో చెబుతారా?  అంటే మీ జేబులో వేసుకునేటప్పుడు అది ప్రజాధనం అని గుర్తుకురాలేదా? విద్యుత్ సంస్థలకు మీ నాయన పెట్టిన కన్నాన్ని పూడ్చేటందుకు 2015లో ఉదయ్ పథకాన్ని ఉపయోగించుకుని రూ.8,892 కోట్ల నష్టాలను సరిచేసే ప్రయత్నం చేశాం. 2015-16లో యూనిట్ రూ. 4.63కు కొన్న విద్యుత్తును 2018-19లో రూ.2.72 కు కొంటున్నాం. ఇది చెప్పకుండా పాత ధరల మీదే రాద్ధాంతం ఎందుకు?’ అని నిలదీశారు. ఈ మేరకు నారా లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.