తెలంగాణ సీఎం కేసీఆర్ కు దైవభక్తి మెండు. కేవలం దేవాయాలను సందర్శిన వరకే పరిమితం కాకుండా స్వయంగా యాగాలను సైతం నిర్వహించారాయన. మన దేశంలో మహాభారత గ్రంథాన్ని పఠించిన ఏకైక సీఎం కేసీఆర్ అని నిన్ననే స్వరూపానంద కూడా ప్రశంసించారు. కానీ ఆయన కుమారుడు కేటీఆర్ మాత్రం ఇందుకు విరుద్ధం. ఆయన భక్తి ఉందో లేదో కానే బయటకి మాత్రం ఆయన పెద్దగా ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించరు. గతంలో కుటుంబ సమేతంగా దేవాలయ సందర్శనకు వెళ్లినప్పుడు మాత్రమే కేటీఆర్ కూడా ఆలయం లోపలికి వెళ్లారు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువు దీరాక.. మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసే సమయంలో మిగతా మంత్రులంతా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తే కేటీఆర్ మాత్రం ఆత్మసాక్షిగా అంటూ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కేసీఆర్ తిరుమల వెళ్లినా, విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లినా.. ఆ పర్యటనలకు కేటీఆర్ దూరంగా ఉంటారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్ను ఆహ్వానించడం కోసం విజయవాడ వెళ్లిన కేసీఆర్ బృందంలో కేటీఆర్ కూడా ఉన్నారు. జగన్ను ఆహ్వానించడం వరకే పరిమితమైన కేటీఆర్.. అంతకు ముందు అమ్మవారి దర్శనానికి.. ఆ తర్వాత శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్ కుమార్ శర్మ సన్యాస దీక్ష తీసుకునే కార్యక్రమానికి హాజరు కాలేదు. కేటీఆర్ అమరావతి పర్యటనలో అసలు విశేషం ఏంటంటే.. దైవ భక్తి పట్ల పెద్దగా ఆసక్తి కనబర్చని ఆయనకు జగన్ వినాయకుడి ప్రతిమను బహుమతిగా ఇవ్వడం.