ఏపీ, తెలంగాణ మధ్య బలపడుతున్న సంబంధాలను మరింత బలపేతం చేయడంతోపాటు విభజన సమస్యల పరిష్కారానికి ఇరువురు ముఖ్యమంత్రులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈరోజు భేటీ కానున్నారు. జగన్ సీఎం అయ్యాక ఇరువురూ కలుసుకోవడం ఇది నాలుగోసారి కాగా ఈ భేటీలో ప్రధానంగా గోదావరి, కృష్ణా జలాలతోపాటు ఐదు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే ఈ అంశంపై పలుసార్లు భేటీ అయిన కేసీఆర్, జగన్‌లు.. గవర్నర్ సమక్షంలోనూ చర్చించారు. ఈ ఉదయం 10.00 గంటలకు ప్రగతి భవన్ లో జరగనుంది. గోదావరి వరద జలాల తరలింపు, కృష్ణా, గోదావరి బేసిన్లలో నీటిని సమగ్రంగా వినియోగించుకోవడం, విద్యుత్తు సంస్థల విభజన, 9, 10 షెడ్యూలు సంస్థల విభజన సహా పలు అంశాలపై సీఎంలు చర్చించనున్నారు. అలాగే ఢిల్లీలోని ఏపీ భవన్‌పై కూడా చర్చించే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణాలకు సంబంధించిన ప్రధాన అంశాలపై కేసీఆర్, జగన్ చర్చించి ఓ అంగీకారానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద సమస్యలకు సామరస్య పరిష్కారం, గోదావరి వరద నీటిని రెండు రాష్ట్రాల్లోని కరవు ప్రాంతాలకు మళ్లింపుపైనే చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి ఏడుగురు, ఏపీ నుంచి ఐదుగురు మంత్రులు, రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు ఎస్కే జోషి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, నీటిపారుదల, ఆర్థిక, విద్యుత్, పౌరసరఫరాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, జీఏడీ ముఖ్యకార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. వీరితోపాటు రెండు ప్రభుత్వాల సలహాదారులు, నీటిపారుదల శాఖ, ఆర్థిక, ఇంధన శాఖల ముఖ్యకార్యదర్శులు, ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు, పునర్విభజన చట్టం అమలుకు సంబంధించిన అధికారులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది.