Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ అధినేత జగన్ మళ్లీ తన పాత వ్యూహాన్ని బయటకు తీశారు. ఢిల్లీ కి ఏది చెప్పదల్చుకున్నా నేషనల్ మీడియా కి ఇంటర్వ్యూ ఇచ్చే పద్ధతికి ఇంకోసారి తెర లేపారు. పాదయాత్ర లో పాల్గొంటూ కూడా cnn ఛానల్ కి జగన్ ఇంటర్వ్యూ ఇవ్వడం ఆ వ్యూహంలో భాగమే. అయితే అందులో మాట్లాడిన విషయాలు చూస్తుంటేనే జగన్ అమాయకత్వం, అతి తెలివి ఏక కాలంలో కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి జగన్ చేసిన ప్రతిపాదన ఈ మొత్తం ఇంటర్వ్యూ లో హైలైట్.
ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ గనుక ప్రత్యేక హోదా ఇస్తానంటే ఆ పార్టీ తో పొత్తుకు ఓకే అని జగన్ చెప్పడం ఆయన రాజకీయ అమాయకత్వానికి అద్దం పడుతోంది. బీజేపీ నిజంగానే ప్రత్యేక హోదా ఇవ్వదలుచుకుంటే జగన్ అడిగిన దాకా ఊరుకుంటుందా ? ఆ హోదా విషయంలో చంద్రబాబు నే సైలెంట్ చేసి ప్యాకేజ్ కి ఒప్పించిన కేంద్రం ఏ విధంగా ఆ హామీ ఇస్తుంది ? ఇవ్వదు కాక ఇవ్వదు. పైగా జగన్ తో పొత్తుకు బీజేపీ కూడా ఉవ్విళ్ళూరడం లేదు. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ బలం ఏమిటో బీజేపీ కి ప్రధాని మోడీకి బాగానే అవగాహన వుంది. అందుకే చంద్రబాబు తమకు ఏదో సమయంలో ఏకులా వచ్చి మేకులా మారతాడని సందేహం ఉన్నప్పటికీ ఆయన్ని పూర్తిగా వదులుకోలేకపోతున్నారు. జగన్ బలం పెరిగిందని నమ్మకం కుదిరితే ఏదైనా ఆలోచిస్తారు గానీ లేకుంటే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వైపు చూడదు. ఈ విషయం తెలిసి కూడా బీజేపీ తో ఎన్నికల పొత్తుకు షరతులు పెట్టడం జగన్ అమాయకత్వమే.
ఇక జగన్ అత్యాశ కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా బయటకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో కూడా మెజారిటీ తక్కువో, ఎక్కువో మోడీ నే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని జగన్ విశ్వాసం. అందుకే ఆ పార్టీతో పొత్తుకు జగన్ ఇంతగా ఆరాటపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ ప్రజలు కాంగ్రెస్ తో సమానంగా బీజేపీ ని ద్వేషిస్తున్నారని చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. అయినా ఆ పార్టీ మీద పల్లెత్తు మాట అనకుండా ఇంకో టర్మ్ కూడా అవినీతి కేసులు తనని ఏమీ చేయకుండా చూసుకోవాలని జగన్ తాపత్రయం. అందుకే పొత్తు కుదరకూడదని అనుకుంటూనే పొత్తు ప్రతిపాదన చేయడం జగన్ అత్యాశకు ఓ ఉదాహరణ. ఈ రెండు విషయాలు జాగ్రత్తగా గమనిస్తే జగన్ కి మోడీ అంటే నమ్మకం. అధికారంలోకి మళ్లీ వస్తాడని. మోడీ అంటే భయం. ఏది మాట్లాడితే కేసుల విషయంలో ఏమి చేస్తాడో అని.