Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ పై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని చోట్లా ఉన్నట్టే రాజకీయాల్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని, అయితే పార్లమెంట్ లో ఉన్నట్టు మాత్రం తనకు తెలియదని చెప్పారు. కాస్టింగ్ కౌచ్ అన్నిచోట్లా ఉందని, పార్లమెంట్ దీనికి అతీతం కాదని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ జేసీ ఇలా వ్యాఖ్యానించారు. అనంతరం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై జేసీ వ్యంగాస్త్రాలు సంధించారు. జగన్ తన తల్లి విజయమ్మ గర్భంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రిని కావాలి అని కలవరించి ఉంటాడని చమత్కరించారు. పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి కావాలనే కలలుకంటున్నారని, వాళ్లిద్దరి కలలు నెరవేరవని జోస్యం చెప్పారు. గవర్నర్ నరసింహన్ పైనా జేసీ తీవ్ర విమర్శలు గుప్పించారు.
నాడు సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న గవర్నర్ ఇప్పుడు ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడిగా మారిపోయారని ఆరోపించారు. ఏపీకి ప్రధాని ఏమీ ఇవ్వడనే విషయాన్ని మూడున్నరేళ్ల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను చెప్పానని జేసీ అన్నారు. చంద్రబాబు తెలివైన వ్యక్తికాబట్టే కేంద్రంతో నాలుగేళ్లు కలిసిఉన్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తపన ఉన్నప్పటికీ… చంద్రబాబు ఒక్కరే ఆ పనిచేయలేరని, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడానికి ముఖ్యమంత్రి తీవ్రంగా శ్రమిస్తున్నారని జేసీ వివరించారు. రాష్ట్రంలో పరిపాలన అత్యద్భుతంగా ఉందని తాను చెప్పడంలేదని, కానీ చంద్రబాబు కంటే బాగా పాలించేవారు మాత్రం ఎవరూ లేరని జేసీ వ్యాఖ్యానించారు.