అవిశ్వాసం పెట్టాక తెలుగుదేశానికి షాకిచ్చిన జేసీ !

jc diwakar reddy comments on TDP's no confidence motion

జేసి దివాకర్ రెడ్డి తెలుగు రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు, మంచి నాయకుడిగా ఎంత పేరుందో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ అంతే పేరుంది. జేసి ఏది మాట్లాడినా వెటకారంగా, కాస్త దెప్పి పొడుపు ధోరణిలో ఉంటుంది. అతని మాట తీరు అంతే అని ఆయన మాటలని ఎవరు పెద్దగా పట్టించుకోరు. అయితే అవిశ్వాస తీర్మానం మీద జేసి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. బీజేపీని ఇరుకున పెట్టి, తద్వారా రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్, జనసేనలకు గట్టి సమాధానం ఇవ్వాలని చూస్తోంది. ఇందుకోసం సీఎం చంద్రబాబు నాయుడు, అధికారులు, పార్టీ నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జేసీ ఊహించని షాకిచ్చారు.

జేసి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేది లేదని తేల్చిచెప్పేశారు. ‘నాకు హిందీరాదు, ఇంగ్లీషూ రాదు.. నేనెందుకు పార్లమెంటుకు వెళ్ళాలి.? అయినా అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వమేమీ పడిపోదు కదా.!’ అంటూ జేసీ దివాకర్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంతేనా, టీడీపీ విప్‌ జారీ చేసినాసరే, పార్లమెంటు సమావేశాలకు హాజరు కాబోనని తెగేసి చెప్పారు. టీడీపీ ఎంపీల బృందానికి నేతృత్వం వహిస్తున్న సుజన తనను విస్మరిస్తున్నారని సీరియస్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది. కీలకమైన అవిశ్వాసానికి ముందు జేసీ అసంతృప్తి టీడీపీని ఇరుకున పెట్టే అంశం. దీంతో రంగంలోకి దిగిన అధిష్టానం ఆయనను బుజ్జగిస్తోంది.