Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశమంతా కర్నాటక గురించే మాట్లాడుకుంటుంది. ముఖ్యంగా జేడీఎస్ పై అందరి దృష్టీ నెలకొంది. జేడీఎస్ కింగ్ మేరకర్ గా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో… దళపతుల మద్దతు ఎవరికనేదానిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. భావసారూప్యత దృష్ట్యా జేడీఎస్ కాంగ్రెస్ కు మద్దతిస్తుందని కొందరు రాజకీయవిశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఎన్నికల్లో కలిసి పోటీచేసిన జనతాదళ్, బీఎస్పీ… ఫలితాల తర్వాత పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురయితే… కాంగ్రెస్ తో కలిసి నడవాలని ఒప్పందం చేసుకోవడాన్ని కూడా ప్రస్తావిస్తున్న వారు… కాంగ్రెస్… జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాయని… నమ్మకంగా చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. ప్రస్తుత రాజకీయపరిస్థితుల్లో… జేడీఎస్ బీజేపీకి మద్దతిచ్చే అవకాశమే ఎక్కువగా ఉందని, రెండు పార్టీల మధ్య ఇప్పటికే ఈ మేరకు ఓ అవగాహన కుదిరిందని, ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ, దేవెగౌడ పరస్పరం ప్రశంసలు కురిపించుకోవడం ఇందులో భాగమేనని విశ్లేషిస్తున్నారు. బీజేపీ మద్దతుతో కుమారస్వామి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే… కుమారుడనీ చూడకుండా ఆయన్ను కుటుంబం నుంచి వెలివేస్తానని దేవెగౌడ చేసిన హెచ్చరిక మనసులోనుంచి వచ్చినది కాదని, పైపై మాటేనన్నది కొందరి అభిప్రాయం.
కింగ్ మేకర్ గా అవతరిస్తే…. కుమారస్వామి బీజేపీకి మద్దతివ్వడానికో లేదంటే ఆ పార్టీ మద్దతుతో తానే ప్రభుత్వం ఏర్పాటుచెయ్యడానికో ప్రయత్నిస్తారన్న విశ్లేషణలు కన్నడనాట వినపడుతున్నాయి. మొత్తానికి…. దళపతులే కింగ్ మేకర్స్ అన్న అంచనాల నేపథ్యంలో పోలింగ్ ముగిసిన వెంటనే కుమారుడు నిఖిల్ ను తీసుకుని కుమారస్వామి సింగపూర్ వెళ్లారు. పార్టీ తదుపరి కార్యాచరణపై చర్చించేందుకే ఆయన సింగపూర్ లో మకాం వేసినట్టు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన నేతలు కుమారస్వామి, దేవెగౌడతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారని, ఇక్కడ ఉండే మీడియాకు తెలిసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో….రెండు పార్టీల నేతలతో చర్చించేందుకు వీలుగానే కుమారస్వామి సింగపూర్ వెళ్లి ఉంటారని ఆయన సన్నిహితుడొకరు చెబుతున్నారు. అయితే సాధారణ వైద్యపరీక్షల కోసమే ఆయన సింగపూర్ వెళ్లారని, సోమవారం రాత్రికి ఆయన బెంగళూరుకు చేరుకుంటారని జేడీఎస్ వర్గాలు తెలిపాయి. కుమారస్వామి సింగపూర్ పర్యటననున పక్కనపెడితే…జేడీఎస్ ఏ జాతీయ పార్టీ వైపు మొగ్గుచూపుతుంది…లేక..అసలు కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఆ పార్టీకి లభిస్తుందీ……లేనిదీ మంగళవారం తేలనుంది.