Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు.
కాలభైరవుడు అనగానే హేళనగా కుక్క అనేస్తాం. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వాడే తప్ప ఆయనే కుక్క కాదు.
కుక్క అంటే విశ్వసనీయతకు మారుపేరు. రక్షణకు కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక. కాలస్వరూపం ఎరిగిన వాడు. కాలంలాగే తిరుగులేనివాడు.
ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. కాలభైరవుడు మన పురాణాల ప్రకారం అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోథ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీష్మ భైరవుడు, శంబర భైరవుడు అని 8 రకాలు.
వీరు కాక మహాభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు మరో ఇద్దరు కనబడతారు. స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది.
స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు.
ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి.
నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి.
కాలభైరవుని భక్తిశ్రద్ధలతో కొలిచే వారు ”ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే, తన్నో కాలభైరవ ప్రచోదయాత్” అని ప్రార్థిస్తారు.
మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి.
ఈ క్షేత్రాలలో ఉండే కాలభైరవుని క్షేత్రపాలకుడు అంటారు. నేపాల్, ఇండోనేసియా, థాయ్‌లాండ్ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది.
ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవతంగాఉంటాడు. నేపాల్ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు.
గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి.
కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది.
సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు.
భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు.
దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు.
ఈశ్వరుడు ఆయుష్షుని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.
కాలభైరవుని ‘క్షేత్రపాలక’ అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారు.
మన దేశంలో కాలభైరవుని దేవాలయాలు చాలానే ఉన్నాయి.
మన రాష్ట్రంలో శ్రీకాళహస్తిలో కాలభైరవుడు, బట్టల భైరవుడు దర్శనమిస్తారు.
విశాఖపట్నంలో భైరవకోన ఎంతో ప్రముఖమైంది. కాగా నిజామాబాద్‌లోని రామారెడ్డి ప్రాంతంలో కాలభైరవ స్వామి దేవాలయం వుంది.
న్యూఢిల్లిద్ పురానా ఖిల్లా దగ్గరున్న భైరవాలయం అతి ప్రాచీనమైంది. పాండవ సోదరుల రాజధాని ఇంద్ర ప్రస్త నగరంeలో ప్రశస్తమైన కాలభైరవ ఆలయం ఉంది.
తమిళనాడు, అరగలూరులోని శ్రీకామనాథ ఈశ్వరాలయంలో అష్ట భైరవుడున్నాడు. అలాగే కరైకుడి, చోళపురం, అధియమాన్ కొట్టయ్, కుంభకోణాల్లో భైరవ దేవాలయాలు ఉన్నాయి.
మధ్యప్రదేశ్ ఉజ్జయినీలో కాల భైరవాలయం వుంది. కర్ణాటకలోని అడిచున్‌చనగిరి, మంగళూరు కద్రి ప్రాంతాల్లో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి.
భక్తులు తమకు క్రమశిక్షణ అలవడాలని, ప్రయాణాల్లో రక్షకుడుగా తోడుండాలని, నిరంతరం ఆపదలనుండి కాపాడాలని భక్తిప్రపత్తులతో కాలభైరవుని పూజిస్తుంటారు.
శిరిపురపు శ్రీధర్