Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కావేరీ జలాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించలేమని కర్నాటక తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా…తమిళనాడుకు ప్రస్తుతం ఇస్తున్న దానికంటే 4 టీఎంసీలు అదనంగా నీటిని విడుదల చేసే పరిస్థితిలో కర్నాటక లేదని నీటి వనరుల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ వెల్లడించారు. క్షమించాలని, తమిళనాడుకు నీరివ్వలేమని…ఇవ్వాలని తమకున్నా…తమ వద్ద అంత నీటి నిల్వలేదని ఆయన స్పష్టంచేశారు. కావేరీ బేసిన్ లోకి నాలుగు కాల్వల నుంచి మొత్తం 9టీఎంసీల నీరు వస్తోందని ఆ 9 టీఎంసీలు తమకు తాగడానికి, పొలాలకు సరిపోవడం లేదని తెలిపారు. తమకు నీటికొరత ఉందని, కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించలేకపోతున్నామని, దీనిపై సుప్రీంకోర్టు కు వివరణ ఇస్తామని మంత్రి చెప్పారు. దశాబ్దాలుగా కర్నాటక-తమిళనాడు మధ్య కావేరీ జలాల వివాదం కొనసాగుతోంది. ఈ అంశం రెండు రాష్ట్రాల మధ్య ఎన్నోసార్లు ఉద్రిక్తతలకు దారితీసింది. సుప్రీంకోర్టులో దీనిపై వాదోపవాదాలు సాగాయి. 120 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తమిళనాడుకు 177.25 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్నాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2007లో కావేరీ జలవివాద పరిష్కార ట్రిబ్యునల్ ఆదేశాలతో పోలిస్తే..ఇది తక్కువ కావడంతో..తమిళనాడులో దీనిపై ఆందోళన చెలరేగింది. కావేరీ యాజమాన్య బోర్డు నిర్వహించాలని తమిళనాడు ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడుకు ప్రస్తుతం ఇస్తున్న దానికన్నా 4 టీఎంసీలు అదనంగా నీటిని విడుదల చేయాలని కర్నాటకను సుప్రీంకోర్టు ఆదేశించింది. కావేరీ యాజమాన్య బోర్డు నిర్వహణపై మే 4 కల్లా ముసాయిదా అందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశించిన గడువు ఇవాళ్టితో ముగుస్తున్నప్పటికీ…కర్నాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధాని మోడీ ముసాయిదాను ప్రవేశపెట్టలేకపోయారు. దీంతో కేసును సుప్రీం ఈ నెల 8కి వాయిదా వేసింది.