సార్వత్రిక ఎన్నికల సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న కర్నాటక ఎన్నికల్లో కన్నడ ఓటర్లు విభిన్నరీతిలో స్పందించారు. ఎన్నికల్లో పోటీచేసిన అన్ని పార్టీలకు అధికారం అప్పగించకపోయినప్పటికీ… ఎంతో కొంత సంతృప్తిని మాత్రం మిగిల్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి… రాష్ట్రంలోనూ ఎక్కువ సీట్లు కట్టబెట్టి… బీజేపీకి ఆ విధంగా సంతృప్తి కలిగించారు కన్నడ ఓటర్లు. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే… ఆ పార్టీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవలేకపోయినప్పటికీ… బీజేపీ కన్నా ఎక్కువగా ఓట్లు మాత్రం సొంతం చేసుకుంది. అత్యధిక స్థానాలు సాధించిన బీజేపీకి వచ్చిన ఓట్లశాతం 36.7 కాగా, విచిత్రంగా కాంగ్రెస్ మాత్రం… ఆ పార్టీ కన్నా ఎక్కువగా… 38.1 శాతం ఓట్లు సాధించింది.
కాంగ్రెస్ పై బీజేపీ గెలిచిన స్థానాల్లో ఆ పార్టీ స్వల్ప మెజార్టీ మాత్రమే సాధించడం దీనికి కారణం. అలాగే బీజేపీపై కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో మార్జిన్ ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి చూస్తే… కర్నాటక ఓటర్లు కాంగ్రెస్ కు సంతృప్తికర ఓటమిని ఇచ్చాని చెప్పొచ్చు. ఇక..ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న జేడీఎస్ కు కింగ్ మేకర్ అయ్యే అవకాశం కల్పించి… ప్రాంతీయఅభిమానం చాటుకున్నారు కన్నడిగులు. హేమాహేమీల్లా జాతీయపార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల్లో తలపడినప్పటికి… ఫలితాల తర్వాత మాత్రం ఆ రెండు పార్టీలు జేడీఎస్ మద్దతు కోసం వెంపర్లాడాల్సిన స్థితి కల్పించారు. మొత్తానికి దేశరాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తాయని భావించిన ఎన్నికల్లో విశిష్ట తీర్పు ఇచ్చారు కన్నడ ప్రజలు.
అన్ని పార్టీలనూ సంతృప్తి పరిచిన కన్నడ ఓటర్లు
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]