నటీనటులు – బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, మెహ్రీన్, నీల్ నితిన్, హర్షవర్ధన్ రాణే, పోసాని తదితరులు
దర్శకుడు : శ్రీనివాస్ మామిళ్ళ
నిర్మాత: నవీన్ చౌదరి సొంటినేని (నాని)
సంగీతం : ఎస్ఎస్ థమన్
సినిమాటోగ్రఫర్ : ఛోటా కే నాయుడు
ఎడిటింగ్ : ఛోటా కే ప్రసాద్
నిర్మాణ సంస్థ: వంశధార క్రియేషన్స్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరైన హిట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా అందాల చందమామ కాజల్‌తో కలిసి ‘కవచం’ చిత్రంతో నేడు థియేటర్స్‌లోకి వచ్చాడు. మెహ్రీన్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో ఆయన ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్ శొంఠినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘కవచం’ మూవీ ఫస్ట్ లుక్‌తోటే మంచి ఇంప్రెషన్ రాబట్టిన బెల్లంకొండ ఆయన కెరియర్లో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. టీజర్, ట్రైలర్లతో పాటు యువ సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఇప్పటికే నాలుగు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించిన సాయి శ్రీనివాస్ కెరియర్లో ఎప్పుడూ లేనంతగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 15 కోట్లపైగా జరగడం విశేషం. ఈ సినిమా మొత్తాన్ని రూ. 30 కోట్లతో రూపొందించగా సగానికి పైగా విడుదలకు ముందే రాబట్టింది. దీంతో ఈ సినిమా మీద ఆసక్తి సహజంగానే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సినిమా మరి ఆ అంచనాలను అందుకుండా లేదా అనేది తేలియాలంటే రివ్యూ చదివెయ్యండి మరి.
కధ :
విజయ్ (బెల్లంకొండ) ఓ పోలీస్ అధికారి. తన డ్యూటీ తాను సిన్సియర్‌గా చేస్తుంటాడు. ఎలా అయినా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనిపించుకోవాలని అతని కల. అయితే అతను ఓ అమ్మాయి (కాజల్)ని చూసి ఇష్టపడతాడు. తన మనసులో మాట చెప్పేలోగా ఆ అమ్మాయి దూరమైపోతుంది. ఈలోగా సంయుక్త (మెహరీన్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఓ ఆపదలో ఉన్న సంయుక్తని విజయ్ కాపాడతాడు. అయితే అనుకోకుండా విజయ్ తల్లి ఓ రోడ్డు ప్రమాదానికి గురవుతుంది. ఆపరేషన్‌కి రూ.50 లక్షల వరకూ కావల్సివుంటుంది. అంత డబ్బు విజయ్ దగ్గర లేకపోవడంతో తన అమ్మని కాపాడుకోవడానికి సంయుక్త ఓ ప్లాన్ చెబుతుంది.
తనని కిడ్నాప్ చేసి, మేనమామ దగ్గర నుంచి రూ.50 లక్షలు డిమాండ్ చేయమంటుంది. తప్పని సరి పరిస్థితుల్లో కిడ్నాప్ నాటకం ఆడి, తల్లిని రక్షించుకుంటాడు విజయ్. అయితే ఆ కిడ్నాప్ డ్రామానే తన జీవితాన్ని మలుపు తిప్పుతుంది. తనకు పరిచయమైనది సంయుక్త (మెహ్రీన్) కాదని ఆమె పేరు లావణ్య (మెహ్రీన్) అని తెలుసుకుంటాడు. అసలు సంయుక్త (కాజల్) తాను గతంలో ప్రేమించి.. కనిపించకుండా పోయిన అమ్మాయే అని తెలుసుకుంటాడు. ఇంతకీ లావణ్య ఎవరు? సంయుక్త ఎవరు? లావణ్య.. సంయుక్తగా ఎందుకు మారింది? దీని వెనుక ఉన్నది ఎవరు? దాన్ని విజయ్ ఎలా బయట పెట్టగలిగాడు అన్నదే మిగతా కథ.
విశ్లేషణ :
కొత్త దర్శకుడు కొత్త కంటెంట్‌తో మాయ చేస్తాడని థియేటర్‌కి వెళ్లిన ప్రేక్షకులకి తలంటేసాడు శ్రీనివాస్ మామిళ్ల. తొలి పది నిమిషాల్లోనే సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశాడు కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల. కోట్ల ఆస్తికి ఒక్కరే వారసురాలు ఆ ఆస్థిని కాజేయాలిని చూసే బంధువులు హీరో ఆమెను కాపాడటం ఆమె హీరో ప్రేమలో పడటం ఇలాంటి పాత చింతకాయ కథల్ని బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి మన దర్శకులు ప్రేక్షకుల నెత్తిన రుద్దుతూనే ఉన్నారు. ఇప్పుడు కొత్త దర్శకుడు ఇదే కథతో మళ్లీ నాటి కథల్ని గుర్తు చేశాడు తప్పితే కొత్తగా చెప్పిందేమీ లేదు. హీరో విలన్ల మధ్య నడిచే మైండ్ గేమ్‌లో కూడా హీరోయిజాన్ని పండించడానికి అక్కర్లేని లాజిక్కుల్ని తెర పై చూపించే ప్రయత్నం చేశారు. కథలో చాలా మలుపులు ఉన్నప్పటికీ వాటిని ప్రేక్షకుడు ముందే ఊహించేయడంతో ట్విస్ట్‌లలో పస లేకుండా పోయింది. దీనికి తోటు క్లైమాక్స్‌లో ఫైట్ ని పాతకాలంలోలానే తీయడంతో సినిమా పాత చింతకాయ పచ్చడి లానే అనిపించింది.
ఇక నటీనటుల విషయానికి వస్తే హీరోగా 5 సినిమాలు చేసినప్పటికీ బెల్లంకొండ వారసుడు ఇంకా నటనను నేర్చుకుంటూనే ఉన్నాడు. డైలాగ్‌లో పస ఉన్నప్పటికీ డైలాగ్ డెలివరీలో తేలిపోతూ హావభావాల్ని పలికించలేకపోతున్న్నాడు బెల్లంకొండ. అయితే పోలీస్ ఆఫీసర్‌కి తగ్గ ఫిజిక్ ఉండటంతో ఆ పాత్రకు మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయాడు. అయితే డైలాగ్‌లు చెప్పడానికి ఎప్పటిలాగే ఇబ్బందిపడ్డాడు. ఇక హీరోయిన్గా నటించిన కాజల్ నటన పరంగా తనకు తిరుగులేదని స్టార్ హోదాను కాపాడుకునే ప్రయత్నమైతే చేసింది. అయితే రొటీన్ కథలో ఆమె నటనకు ఆస్కారం లేకపోయింది. మరో హీరోయిన్ మెహ్రీన్ ఉన్నది కాని ఆమెది అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర కాకపోగా నెగిటివ్ షేడ్స్‌లో చూపించారు. ముఖేష్ రుషి, పోసాని క్రిష్ణ మురళి లాంటి సీనియర్ నటులు ఉన్నా వాళ్లను పెద్దగా వాడుకోలేకోలేకపోయాడు దర్శకుడు.
ఇక టెక్నికాలిటీ పరంగా చూస్తే తమన్ తన పాటలతో పర్వాలేదనిపించినా బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌పై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. విశాఖ అందాలను కెమెరాలో బాగా చూపించగలిగారు. సినిమా రన్ టైమ్ కూడా ఎక్కువ అవడంతో చోటా కె ప్రసాద్ తన కత్తెరకు పని చెప్పాల్సింది. అబ్బూరి రవి డైలాగ్స్ అక్కడక్కడా పేలాయి. స్క్రీన్స్ ప్లే మాత్రం గజిబిజి గందరగోళంలా ఉంది. లేనిపోని ట్విస్ట్‌లు, అక్కర్లేని సీన్లు, పాత్ర పరిచయాలతో ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేశారు.
తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : కాపాడలేని కవచం
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.25 / 5