కేసీఆర్ కి గెలుపు భయం…!

KCR Is Scared Of Candidates With Surveys

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల హామీలు రోజురోజుకు పెరిగిపోతున్న్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీని రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. మరోవైపు, ప్రతిపక్షాలలోని కొన్ని ప్రధాన పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటి పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే, మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఏ స్థానం ఎవరికి దక్కుతుందో తెలియక ఆయా పార్టీల నేతలు అయోమయానికి గురవుతున్నారు. టీజేఎస్, సిపిఐ తాము కోరినన్ని సీట్లు ఇవ్వకపోతే కూటమి నుంచి బయటికి వెళ్లి ఒంటరిగా పోటీ చేస్తామని ఈరోజు సాయంత్రం దాకా అల్టిమేటం జారీ చేశాయి.

elections
ఈ పరిణామంతో కాంగ్రెస్ లో కొంత అలజడి ప్రారంభమైంది. ఆ రెండు పార్టీలు కూటమి నుంచి ఇంటికి వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం ఉండటంతో వాటిని దూరం చేసుకోకూడదని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ ఎంట్రీ తీవ్ర చర్చనీయాంశం అయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి గద్దర్ పోటీ చేస్తానని కొద్దిరోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు, మహాకూటమి సహా అన్ని పార్టీలు తనకు మద్దతు తెలపాలని కోరారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి వివరించేందుకు ఢిల్లీకి కూడా వెళ్లారు. ఈ విషయంలో ఆయనకు క్లారిటీ వచ్చిందో లేదో తెలియదు కానీ, ఆ స్థానంపై ఆశలు పెట్టుకున్న ఒంటేరు ప్రతాపరెడ్డి మాత్రం క్లారిటీగానే ఉన్నారు.

kcr-telangana
గతంలో ఈ స్థానం నుంచి పలుమార్లు పోటీ చేసిన కారణంగా తనకే టికెట్ కన్ఫామ్ అని ధీమాగా ఉన్నారు. ఇదొక్కటే కాక ప్రతాపరెడ్డికి గజ్వేల్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. గత ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసినా ఆయన కేవలం 19 వేల పైచిలుకు తేడాతోనే ఓడిపోయారు. ఈసారి కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఆయన నియోజకవర్గంలో ఎన్నో పనులు చేస్తూ ఓటర్లతోనే కలిసి ఉన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో కూడా గజ్వేల్ నుంచే పోటీ చేయాలని ఆయన ఫిక్సయ్యారు. 2014లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న కేసీయార్ కు ఇక్కడి నుంచి కేవలం 19 వేల పైచిలుకు మెజారిటీ దక్కింది. టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన వంటేరు ప్రతాపరెడ్డికి 67,154 ఓట్లు రాగా కేసీయార్కు 86,372 ఓట్లు దక్కాయి. ఇది మొత్తం పోలైన ఓట్లలో 44.06 శాతానికి సమానం. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన తూముకుంట నర్సారెడ్డికి 34 వేల ఓట్లు దక్కాయి.

election2018

ఎన్నికల అనంతరం ఇక్కడి రాజకీయ ముఖ చిత్రం మారింది. ఒంటేరు ప్రతాపరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉండగా నర్సారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో లేరు. అంతే కాక ముఖ్యమంత్రి ఫాంహౌజ్ ఉన్న ప్రాంతంలో కొంత అభివృద్ధి చోటు చేసుకున్నప్పటికీ చుట్టుపక్కల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంగానీ, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడం గానీ జరగలేదని, దీనిపై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే కేసీయార్ గజ్వేల్ తో పాటు మేడ్చల్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇందులో వాస్తవమేదీ లేదని టీఆర్ఎస్ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. కేసీయార్ మెజారిటీ ఈసారి మరింత పెరుగుతుందే తప్ప తగ్గదని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కానీ కాంగ్రెస్, టీడీపీలు కలిసిపోటీ చేస్తుండడంతో కేసీయార్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందని దాంతో కేసీయార్ విజయవకాశాలపై ప్రభావం ఉంటుందని లోలోన ఆ పార్టీ ఆందోళన చెందుతోంది.