Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాష్ట్రాలుగా విడిపోదాం, మనుషులుగా కలిసుందాం ఇదీ విభజన సమయంలో టీఆర్ఎస్ నేతల నుంచి వచ్చిన డైలాగ్. కొందరు ఏపీ నేతలు కూడా సేమ్ డైలాగ్ రిపీట్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు. ఏపీ, తెలంగాణ ఫంక్షన్లకు సీఎంలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో పుట్టి పెరిగిన కేసీఆర్… ఆ పార్టీ దివంగత నేత ఎర్రన్నాయుడుతో మంచి సంబంధాలున్నాయి. ఆయన కుమారుడి వివాహానికి ఆహ్వానపత్రిక వచ్చినా కూడా కేసీఆర్ హైదరాబాద్ లో ఈటెల కుమారుడి పెళ్లికే పరిమితమయ్యారు.
ఏపీ సీఎం చంద్రబాబు కూడా తక్కువ తినలేదు. తెలంగాణ మంత్రి ఈటెల కుమారుడి ఆహ్వానపత్రిక అందినా… విశాఖలో రామ్మోహన్ నాయుడి వివాహానికే అటెండయ్యారు. దీంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో పెళ్లిళ్లకే హాజరౌతామనే సందేశాన్ని అందించినట్లైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నేతలు కూడా అనవసర డాబుకు పోకుండా ఎవరి సీఎంని వాళ్లు పిలిస్తే బెటరనే భావన వ్యక్తమవుతోంది. సినీ రంగంలో సెలబ్రిటీల పెళ్లిళ్లకు మాత్రం ఠంచనుగా వెళ్లే సీఎంలు… తోటి రాజకీయ నేతల్ని అవమానిస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది.
ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రభుత్వ పరంగా సంబంధాలు ఎలా ఉన్నా… మానవ సంబంధాలు బాగానే ఉండేవి. కానీ ఇప్పుడు సీఎంల స్థాయిలో ఇలాంటివి ఏంటో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇద్దరు సీఎంలకు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయి. ఆ మాత్రం ఫంక్షన్ కు అటెండ్ కాలేరా అనే వాదన ఉంది. మరోవైపు అసలు ఫంక్షన్లకు వెళ్లకపోతే ఏమౌతుందన్న చర్చ కూడా ఉంది. ఏదేమైనా ఇది మంచి సంకేతం కాదంటున్నారు విశ్లేషకులు.