ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఆంధ్ర ప్రదేశ్ లో అడుగుపెట్టనున్నారు. విశాఖలో జరగనున్న శారదాపీఠం వార్షికోత్సవాల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో వచ్చేనెల 14న జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకానున్నారు. ఇటీవల ఎర్రవల్లిలో ఐదురోజుల పాటు సహస్ర చండీ యాగాన్ని కేసీఆర్ నిర్వహించారు. శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామి యాగానికి హాజరయ్యారు. ఆయన ఆధ్వర్యంలోనే పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాల్సిందిగా కేసీఆర్‌ను స్వరూపానంద స్వామి ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వచ్చేనెల 14న సీఎం కేసీఆర్ విశాఖ వెళ్లి శారదా పీఠాన్ని సందర్శించనున్నారని సమాచరం అందుతోంది. అక్కడ జరిగే అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనలో కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి పాల్గొననున్నారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఫెడరల్ ఫ్రెంట్‌కు సంబంధించిన అధికారిక పర్యటనకి బయలుదేరిన సమయంలో మొదటగా కేసీఆర్ విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.
అయితే ఈ పర్యటనలో ఏపీ ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ తో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. కొన్ని రోజులక్రితం ఫెడరల్ ఫ్రెంట్‌కు సంబంధించి జగన్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలోనే కేసీఆర్ జగన్ ని కలవనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతిలో జగన్ కడుతున్న తన కొత్త ఇంటి గృహ ప్రవేశానికి కేసీఆర్ ని ఆహ్వానించారని,అక్కడే వీరిరువురు భేటీ ఉంటుందని వార్తలు వచ్చాయి. దీనిపై వీరివురు ఎటువంటి ప్రకటనా చేయలేదు. వచ్చే నెల 14న జగన్ గృహ ప్రవేశం చేయనున్నారు. కాగా కేసీఆర్ 14 న విశాఖ వస్తుండటంతో జగన్ కూడా గృహ ప్రవేశానికి ముందు స్వరూపానంద ఆశీస్సుల కోసం శారదాపీఠానికి వెళ్లి అక్కడ కలిసే అవకాశం ఉందని సమాచారం. స్వరూపానందతో జగన్ కి కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం కావడానికి ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం జగన్ నేరుగా విశాఖ వెళ్లి స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్నారు. దీంతో స్వరూపానంద సమక్షంలోనే ఈ భేటీ జరగనుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎంతవరకూ నిజమో తెలీదు కానీ ఈ విషయం మాత్రం సోషల్ మీడియో ట్రెండ్ అవుతోంది.