తెలంగాణ లో మరోమారు కూడా సీఎం అయ్యి, ఏకచత్రాధిపత్యంగా తెలంగాణ పీఠాన్ని ఏలాలని ఉవ్విళ్లూరుతున్న కెసిఆర్, తన వ్యూహపన్నాగాలతో ముందుగానే ముందస్తు ఎన్నికలని ప్రకటించి, అభ్యర్థులను కూడా ప్రకటించి, తెలంగాణ అంతటా ప్రచారం చేస్తూ, సభలలో ప్రసంగిస్తూ దూసుకుపోతున్నాడు. కెసిఆర్ ఇప్పటికే ప్రజా ఆశీర్వాద సభలంటూ కొన్ని జిల్లాల్లో పర్యటించగా, అన్ని జిల్లాలను పర్యటించేందుకు తగిన ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాడు. ఈరోజు గురువారం అనగా నవంబర్ 22 న కెసిఆర్ ఏకంగా మూడు జిల్లాల్లో పర్యటించేందుకు పయనం అయ్యారు.
ఆదిలాబాద్, నిజామాబాద్ మరియు నిర్మల్ జిల్లాలలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించి, పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు అలుపెరుగకుండా పర్యటిస్తున్నారు. వీటిలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలలోని ఇచ్చోడ, నిజామాబాద్ జిల్లాలోని ఆర్ముర్ మరియు నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, బైంసా నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన సభల్లో ప్రసంగం చేస్తారు. ఇందుకోసం మొదటగా ఉదయం 11.15 గంటలకు హెలికాప్టర్‌లో నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ చేరుకుని, విద్యానగర్‌లో నిర్వహించనున్ సభలో ప్రసంగిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 12.35 గంటలకు ఖానాపూర్ నుండి బోథ్ కి బయలుదేరి ఆ నియోజకవర్గంలోని ఇచ్చోడ సభలో 1.00 గంటలకు ప్రసంగిస్తారు. అలాగే మధ్యాహ్నం 2.00 గంటలకు ఎల్లపెల్లి క్రషర్‌రోడ్డులో నిర్వహించే బహిరంగసభలో కెసిఆర్ ప్రసంగిస్తారు.