ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. కిందటి ఎన్నికల్లో కలిసి పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ, బీజేపీ బద్ధశత్రువుల్లా రాజకీయ బరిలో తలపడుతున్నాయి. ఇక ఆ పొత్తుకు అడుగులు ఒత్తిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు ని టార్గెట్ చేసి ఉత్తరాంధ్ర మీద ఫోకస్ చేస్తున్నారు. ఇక పాదయాత్రతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతను, మోడీ, షా మ్యాజిక్ ని నమ్ముకుని వైసీపీ అధ్యక్షుడు జగన్ రాజకీయ ప్రయాణం సాగిస్తున్నారు. ఈ పరిణామాల లోతు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ జనాలకు అర్ధం అవుతోంది. ఇంతలో ఇంకో ఊహించని మలుపు. అయితే ఈసారి మలుపు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో అసలు బతికి ఉందా, లేదా అనుకుంటున్న కాంగ్రెస్ వైపు నుంచి వచ్చింది. ఏపీ మీద ఆశలు వదులుకున్న కాంగ్రెస్ కాస్త ఆలస్యంగా అయినా ఏదో ఒక రూపంలో సౌత్ లో సొంతబలం లేదా మద్దతుదారులను పెంచుకోకపోతే 2019 ఎన్నికల్లో సైతం ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి వస్తుందని అర్ధం చేసుకుంది. అందుకే ఆంధ్రాలో పాత ప్లేయర్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ని తిరిగి దగ్గర చేసుకుంటోంది. పైగా ఇప్పటిదాకా అనుసరిస్తున్న రాజకీయ వైఖరి మార్చుకుని వైసీపీ ని టార్గెట్ చేయాలన్న కిరణ్ సూచనలకు అనుగుణంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ రాష్ట్ర శ్రేణులకు పిలుపు ఇచ్చారు.
ఓ విధంగా చెప్పాలంటే కిరణ్ తాను కాంగ్రెస్ లోకి రావాలంటే వైసీపీ ని టార్గెట్ చేయాలని హైకమాండ్ కి షరతు పెట్టి ఒప్పించారు. ఇక్కడే ఇన్నాళ్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాజకీయాల్ని శాసిస్తున్న కేవీపీ అండ్ టీమ్ కి షాక్ తగిలింది. వై.ఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ లో వున్నా, లేకున్నా పరోక్షంగా చంద్రబాబుని దెబ్బ కొట్టి జగన్ కి లబ్ది చేయడానికి కేవీపీ టీమ్ సభ్యులు గట్టి ప్రయత్నాలే చేశారు. ఈ విధానాల వల్లే 2014 ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ ఏ మాత్రం కోలుకులేకపోయింది. అయితే కాంగ్రెస్ లో మిగిలిన చిన్నాచితకా నాయకులు పార్టీ మీద అభిమానం ఉన్నప్పటికీ కేవీపీ మీద 10 జన్ పథ్ కి వెళ్లి ఫిర్యాదు చేసే చొరవ, ధైర్యం లేకపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ కేవీపీ అండ్ టీమ్ కి చెక్ పెట్టాలని డిసైడ్ అయిపోయింది.
ఇలాంటి పరిణామాల్ని నేర్పుగా, వేగంగా పసిగట్టే నైపుణ్యం కేవీపీ టీమ్ కి ఎటూ వుంది. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడితే, కనీసం కొంత శాతం ఓటింగ్ పెంచుకున్నా అది వైసీపీ కి నష్టం అని గ్రహించిన కేవీపీ అండ్ టీమ్ త్వరలో ఇంకో స్టెప్ తీసుకుంటారు అని తెలుస్తోంది. ఎప్పుడైతే కాంగ్రెస్ ఘనంగా కిరణ్ ని దగ్గరకు తీసుకుంటుందో అప్పుడు మూకుమ్మడిగా పార్టీ నుంచి వైదొలిగి పార్టీ తిరిగి కోలుకోకుండా చేయాలని కేవీపీ అండ్ టీమ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి బయటకు రావడమే కాకుండా అదే ఊపులో వైసీపీ లో చేరి ఆ పార్టీకి కొత్త ఊపిరి పోయాలని అనుకుంటున్నారట. అయితే ఈ టీమ్ లో అందరూ మేధావులే కానీ ప్రజాకర్షణ గల నాయకులు లేరు. అందుకే పార్టీ మారితే వ్యూహాత్మక శ్రేణులుగా వైసీపీ కి ఉపయోగపడవచ్చేమో గానీ ప్రజాక్షేత్రంలో ఈ టీమ్ చర్యలతో పెద్దగా ప్రభావం అవకాశం లేదు.