కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలో తన పేరు ప్రకటించకపోవడంతో అసంతృప్తితో ఉన్న వరంగల్ తూర్పు తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత కొండా సురేఖ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. గత నాలుగేళ్లుగా ప్రయత్నించినా, కేసీఆర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని, టీఆర్ఎస్ ఓ కుటుంబ పార్టీగా మారిపోయిందని ఆమె ఆరోపించారు. పన్నెండుకు రోజులు ఎదురు చూసిన కేసీఆర్ నుండి ఎటువంటి సమాధానం రాని కారణంగా ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమ సారధిగా, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నేతగా కేసీఆర్ అంటే తనకు గౌరవం ఉందని చెబుతూనే, ఆయన ప్రస్తుత చేష్టలు కట్టుకున్న భార్యతో కొంతకాలం కాపురం తరువాత మరొకరి వద్దకు పంపించినట్టు ఉన్నాయని కొండా సురేఖ సంచలన విమర్శలు చేశారు.
అమరవీరులకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించిన ఆమె, ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. నమ్మి అధికారాన్ని చేతికి అప్పగిస్తే, ముందస్తుకు వెళ్లడం ద్వారా తన పతనాన్ని తానే కోరి తెచ్చుకుని, ఇప్పుడు అధికారాన్ని వేరే పార్టీలకు అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డ ఆమె, అధికార మార్పిడి తప్పనిసరని అన్నారు. కేసీఆర్ ను నమ్మినందుకు తనకు నమ్మక ద్రోహం చేశారని ఆరోపించిన కొండా సురేఖ, ఓ మహిళగా, నాలుగుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్న తనను మంత్రివర్గంలోకి తీసుకోకున్నా సర్దుకు పోయానని చెప్పారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా తన గౌరవాన్ని దెబ్బతీశారని, ఇది తనకెంతో బాధను కలిగించిందని అన్నారు. తన పుట్టిన రోజున కేసీఆర్ ఆశీస్సులు తీసుకునేందుకు ప్రయత్నించి కూడా తాను విఫలమయ్యానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం తిండీ తిప్పలు మాని, తమ చదువులను పక్కనబెట్టి, కెరీర్ ను వదులుకుని ఉద్యమించిన యువతకు కేసీఆర్ ఏం న్యాయం చేశారని సురేఖ ప్రశ్నించారు.
టీఆర్ఎస్ పార్టీలో ఏ పదవినీ ఆశించకుండా పనిచేస్తున్న తనను ఇప్పుడు మెడ పట్టుకుని బయటకు గెంటినట్టుగా కేసీఆర్ చేశారని వరంగల్ జిల్లా మహిళా నేత కొండా సురేఖ వాపోయారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేకనే టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నానని చెప్పారు. పార్టీలో ఎన్నో అవమానాలు తనకు ఎదురైనా, కేసీఆర్ మీద గౌరవంతో ఎన్నడూ బయటపడలేదని చెప్పిన ఆమె, తనకు అసెంబ్లీ సీటును నిరాకరించడం వెనకున్న కారణాన్ని కూడా చెప్పలేదని విమర్శించారు. కేటీఆర్ ను సీఎంను చేయాలని అనుకుంటున్న కేసీఆర్, ఎంతో మంది సీనియర్ నాయకులను అణచి వేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అమరవీరుల కుటుంబాలకు టికెట్ ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. తాను అడిగిన ఎన్నో ప్రశ్నలకు కేసీఆర్ నుంచి సమాధానాలు రాలేదని చెప్పారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖను కూడా ఆమె విడుదల చేశారు. ప్రజాస్వామ్య విలువలకు కేసీఆర్ పాతరేశారని, కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేని ఘనత ఒక్క కేసీఆర్ ప్రభుత్వానిదేనని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఓ బీసీ మహిళగా తనకు ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని కూడా ఇవ్వకుండా, కేసీఆర్ తన దొరతనాన్ని చూపించారని ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ను, టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని, అందువల్లే రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నానని ఆమె వెల్లడించారు.