కేటీఆర్ మాట మారింది, నిన్న మొన్నటి వరకూ చంద్రబాబు మీద అంతెత్తున లేచిన ఆయన నిన్న మాట్లాడిన మాటలు విశ్లేశకులని సైతం అబ్బుర పరుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అయితే మహాకూటమిలో చేరిందో అప్పట్నుంచి చంద్రబాబును వ్యక్తిగతంగా కేసీఆర్ దూషించడం ప్రారంభించారు. ఆంధ్రా అనే ఫీలింగ్ తీవ్ర స్థాయిలో లేవనెత్తారు. దీనికి కేటీఆర్ సీమాంధ్రులకు వివరణ ఇచ్చారు. కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇక్కడి సెటిలర్లను ఉద్దేశించినవి కావని, టీడీపీ, చంద్రబాబును ఉద్ధేశించే మాట్లాడారని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో విమర్శలు సహజం అని పేర్కొన్నారు. అంతే కాదు సీమాంధ్ర ప్రజలకు కేటీఆర్ అనే తాను వ్యక్తిగతంగా అండగా ఉంటానని హామీలు ఇచ్చేశారు.
తెలంగాణ వచ్చేంత వరకే గొడవ అని, ఈ నాలుగేళ్లలో ఎక్కడా ప్రాంతీయ వివక్ష జరగలేదని కేటీఆర్ తెలిపారు. 67 ఏళ్లలో హైదరాబాద్ ఎలా ఉండేదో ఈ నాలుగేళ్లలో ఎలా ఉందో చూడాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకునేసరికి కేటీఆర్ కు పరిస్థితులు ఇప్పుడిప్పుడే అవగాహన వస్తున్నట్లుంది. అందుకే వ్యక్తిగత హోదాలో.. తానున్నానంటూ భరోసాల వరకూ వచ్చేశారు. కానీ రాజకీయ అవసరాల కోసం ఎప్పటికప్పుడు ప్లేటు ఫిరాయించే రాజకీయం హైదరాబాద్‌లోని సీమాంధ్రులు చూశారు. హైదరాబాద్ సీమాంధ్రుల విషయంలో కేటీఆర్ పరేషాన్ కావడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయనుకోవచ్చు.
ఓటుకు నోటు కేసు తర్వాత తెలంగాణలో తెలుగుదేశం లేకుండా చేసే ప్రయత్నాన్ని కేసీఆర్ ఓ మిషన్‌లా నడిపారు. ఆ దెబ్బకు ఒక్క సండ్ర వెంకట వీరయ్య మినహా ఇంకెవరూ మిగల్లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఎమ్మెల్యేలు అసలు ఉండలేదు. వాళ్లపై ఎన్ని ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చాయో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ తర్వాత టీడీపీకి నాయకత్వం లేకుండా పోయింది. ఈ కారణంగా టీడీపీ క్యాడర్ అంతా.. తలోదిక్కు అయిపోయింది. అనూహ్యంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తూండటంతో.. మళ్లీ హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఓటర్లు సమీకృతమవుతున్నారు.
ఓ వైపు కాంగ్రెస్‌కు సంప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంక్ టీడీపీ ఓటు బ్యాంక్ కలిస్తే టీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అందుకే కేటీఆర్ వ్యక్తిగత హోదాలో తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. అయితే ” ఆంధ్రోలు పాపం వాళ్ళ బతుకేందో వాళ్ళు బతుకుతున్నారు… వాళ్ళనేమైనా అన్నామా…” అని కేసీఆర్ అన్న మాటలో అర్థం వారికి అనే హక్కున్నా, ఏదో దయతలచి వదిలేసినట్టు గోచరిస్తుంది. అసలు నిజంగా మేకు ఆ బేధ భావమే లేకపోతే ఆంధ్రులు లేదా సెటిలర్స్ అనే పదాలనే వాడకండి. తెలంగాణలో లోకల్స్ ఎంతో, నాన్ లోకల్స్ కూడా అంతే కానీ ఏదో దయతో ఉంటున్నట్లు లేదా ఏదో రక్షిస్తున్నట్లు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరూ గమనిస్తున్నరన్న విషయం మరిచిపోకండి.