Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జేడీఎస్ శాసనసభాపక్ష నేత కుమారస్వామి బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీకి మద్దతు ఇచ్చే జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 100 కోట్లతో పాటు, మంత్రి పదవిని ఆ పార్టీ ఆఫర్ చేస్తోందని, ఇంత నల్లధనం వారికి ఎక్కడ నుంచి వస్తోందని ప్రశ్నించారు. తమ మద్దతు కోసం బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రయత్నించాయని… కానీ, తాను బీజేపీతో కలసి వెళ్లబోనని ఆయన చెప్పారు. తాను కాంగ్రెస్ తో కలసి వెళ్తున్నానని చెప్పారు. బీజేపీ చేపట్టిన అశ్వమేధ యాగం ఉత్తరాదిన ప్రారంభమైందని… కర్ణాటకలో వారి గుర్రాలు ఆగిపోయాయని కుమారస్వామి ఎద్దేవా చేశారు. అశ్వమేధ యాగాన్ని ఆపేయాలనే విషయాన్ని కర్ణాటక ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయని అన్నారు.
బీజేపీని వదిలి, తమతో కలసి వచ్చేందుకు కొందరు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని చెప్పి బీజేపీ క్యాంపులో ఒక్కసారిగా కలకలం రేపారు. తమ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యేను లాగే ప్రయత్నం చేసినా… తాము ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను లాగేస్తామని హెచ్చరించారు. అయితే జేడీఎస్ శాసనసభాపక్ష సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శాసనసభాపక్ష సమావేశానికి డుమ్మా కొట్టిన ఇద్దరు ఎమ్మెల్యేలు స్పందించారు. తాము ఎక్కడికీ పోలేదని, కుమారస్వామితోనే తాము ఉంటామని, బెంగళూరుకు తాము 450 కిలోమీటర్ల దూరంలో ఉన్నామని, అందుకే సమయానికి ఆ సమావేశానికి హాజరు కాలేకపోయామని చెప్పారు.