తిన్నింటికే వాసాలు లెక్కపెట్టడం అనే సామెత ఇలాంటి వారి నుండే పుట్టుకొచ్చిందా అనిపిస్తూ ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలోని జగన్నాథపురంలో సొంత ఇంటికే కన్నం వేసింది ఆ ఇంటి కోడలు. భర్త గుడ్డివాడు కావడంతో అదే ఊరిలోని ఒక ఆటో డ్రైవర్ తో సంబంధం పెట్టుకున్న ఆమె అతని జల్సాల కోసం సొంత ఇంటిలోని బంగారం, నగదు దొంగిలించి ప్రియుడికి అప్పనంగా అప్పగించింది. కట్టుకున్న భర్త, అత్తమామలను మోసం చేసింది. అందుతున్న సమాచారం మేరకు జగన్నాథపురం గ్రామానికి చెందిన ముత్తు రామారావు, పుణ్యవతి దంపతుల కుమారుడైన పుష్పరాజు పుట్టుగుడ్డి అతనికి నరసన్నపేటలో ఉండే సొంత మేనకోడలైన నాగమణితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇంతవరకు బాగానేవున్నా తన ఇంటి పక్కన ఉండే ఆటో డ్రైవర్ రామారావుతో ఏడాది నుంచి వివాహేతర సంబంధం పెట్టుకొని తన అత్తమామలకు, భర్తకు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది నాగమణి. అంతటితో ఆగకుండ తన ప్రియుడిని తృప్తి పరచాలనే ఉద్దేశంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువా తెరిచి అందులో ఉన్న 14 తులాల బంగారం, రూ. 2.35 లక్షల నగదును దొంగిలించి ఒక చోట భద్రపరిచింది. బీరువా తాళాలను బియ్యం డబ్బాలోని అడుగున దాచిపెట్టింది. అత్తమామలని తాళాలు పోయాయని నమ్మించింది. సొంత కోడలే కావడంతో వారికి పెద్దగా అనుమానం రాలేదు.
కొన్ని రోజుల తర్వాత తన తమ్ముడు గణేష్ ప్రమాదంలో చనిపోవడంతో నాగమణి తన కన్నవారి ఇంటికి వెళ్లింది. పెద్దకర్మ జరగకముందే మధ్యలో ఒక్కసారి అత్తవారి ఇంటికి వచ్చి తను భద్రపరిచిన బంగారం, నగదును ఎవరికీ తెలియకుండా తీసుకొని వెళ్లిపోయింది. అయితే బియ్యం డబ్బాలో ఉన్న బీరువా తాళాలు ఆమె అత్త కంటబడ్డాయి. దీంతో బీరువాను తెరువగా అందులో ఉన్న బంగారం, నగదు కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. దీంతో కోడలు నాగమణిని అత్తమామలు అడుగగా తనకు ఏమి తెలియదని సమాధానం చెప్పి తప్పించుకుంది. దీంతో జూలై 14 తేదీన సంతబొమ్మాళి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించగా కోడలు నాగమణి చేసిన తప్పును ఒప్పుకొంది. అయితే పోలీసులు ముందు తను దొంగిలించిన నగదు, బంగారం అమ్మిన సొమ్మును తన ప్రియుడు రామారావుకు ఇచ్చిన్నట్టు నాగమణి ఒప్పుకుంది. అయితే ఈ విషయం మీద కేసు నమోదు కాలేదు, పోలీసులే సివిల్ సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారని వార్తలు వస్తున్నాయి.