Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దాణా కుంభకోణం కేసులో జార్ఖండ్ లోని బిర్సాముండా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కు న్యాయస్థానం ఐదురోజులు పెరోల్ ఇచ్చింది. లాలూ పెద్దకుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం ఈ నెల 12న జరగనుంది. కొడుకు వివాహానికి హాజరయ్యేందుకు గానూ ఈ నెల 10 నుంచి 14 వరకు ఐదురోజుల పెరోల్ కోసం జార్ఖండ్ జైలు శాఖ ఐజీకి లాలూ దరఖాస్తు చేసుకున్నారు. లాలూ దరఖాస్తును పరిశీలించిన న్యాయస్థానం పెరోల్ ఇచ్చింది. బీహార్ కు చెందిన మంత్రి చంద్రికరాయ్ కుమార్తె ఐశ్వర్యరాయ్ ను తేజ్ ప్రతాప్ వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవలే వారి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
జైలులో ఉండడంతో లాలూ ఆ వేడుకకు హాజరుకాలేదు. జైలు జీవితంలో అనారోగ్యానికి గురైన లాలూ జార్ఖండ్ రాజధాని రాంచిలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కిడ్నీ, గుండె సమస్యలతో లాలూ బాధపడుతుండడంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్పించేందుకు సీబీఐ న్యాయస్థానం అనుమతిచ్చింది. చికిత్స అనంతరం లాలూ కోలుకోవడంతో ఇటీవలే ఎయిమ్స్ వైద్యులు ఆయన్ని డిశ్చార్జి చేశారు. కానీ తాను పూర్తిగా కోలుకోలేదని, తనకు మున్మందు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఎయిమ్స్ దే బాధ్యత అని లాలూ హెచ్చరించారు. లాలూను కోలుకోకుండానే డిశ్చార్జి చేశారని ఆరోపిస్తూ ఆర్జేడీ కార్యకర్తలు ఎయిమ్స్ అత్యవసర విభాగంలోని పరికరాలను ధ్వంసం చేసి ఆందోళనలు చేపట్టడంపై దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి.