Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్ కు తొలి చిత్రం హిట్టయితే ఎంతో సంతోషం కలుగుతుంది. హిట్ హీరోయిన్ కు ఆఫర్లు క్యూకడతాయి. అలా వచ్చిన అవకాశాలను ఉపయోగించుంటూ తర్వాత కూడా హిట్ లు మీద హిట్ లు ఆ సాధిస్తే.. ఆ హీరోయిన్ కు ఎలా ఉంటుంది… మాటల్లో చెప్పలేని సంతోషం కలుగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ ది అదే పరిస్థితి. నాని జెంటిల్ మెన్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ మలయాళీ భామ తొలి సినిమాతోనే హిట్ అందుకుంది. తర్వాత నానితోనే ఆమె నటించిన నిన్నుకోరి… కూడా విజయం సాధించింది.
ఈ రెండు సినిమాల తర్వాత ఆమె కు బంపర్ ఆఫర్ దక్కింది. ఎన్టీఆర్ పక్కన జైలవకుశ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో అవకాశం దక్కించుకున్న నివేదా థామస్ ఆ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో ముచ్చటగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తాను నటించిన మూడు సినిమాలను ప్రేక్షకులు ఆదరించడంపై నివేదా ట్విట్టర్ లో భావోద్వేగంగా స్పందించింది. ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ఓ లేఖ రాసింది. ఒక సినిమా హిట్ అవడం ప్రత్యేకమని, మొదటి మూడు సినిమాలనూ ఇంత బాగా ఆదరించి… తనను తెలుగు చిత్ర పరిశ్రమ సొంత మనిషిలా చూసిందని నివేదా తన లేఖలో ఆనందం వ్యక్తంచేసింది. ఈ విజయాల కన్నా పెద్ద ప్రశంస ఏమీ ఉండదని, దీన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నానని ఆమె తెలిపింది. జైలవకుశకు ఇంత పెద్ద విజయం అందించినందుకు కృతజ్ఞతలని.. మరో అందమైన చిత్రంతో కలుస్తానని… ప్రేమతో… మీ నివేదా థామస్ అని ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.