Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పార్లమెంట్ లో పరిస్థితి ఏ మాత్రం మారలేదు. కావేరీ అంశంపై అన్నాడీఎంకె, రిజర్వేషన్ల అంశంపై టీఆర్ ఎస్ సభ్యులు లోక్ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. సభ ఆర్డర్ లో లేనందున టీడీపీ, వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాల విషయంలో ముందుకు వెళ్లలేనని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టంచేశారు. సభ్యుల నినాదాలతో సభ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అవిశ్వాసతీర్మానంపై చర్చ జరపకుండా స్పీకర్ లోక్ సభను వాయిదా వేయడం ఇది నాలుగోరోజు.
అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సభ్యులు సహకరించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పదే పదే విజ్ఞప్తిచేసినా ఫలితం కనిపించకపోవడంతో సభను రేపటికి వాయిదావేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అసభ్యకర సన్నివేశాలను దేశ ప్రజలు చూడాలని తాను భావించడం లేదని వెంకయ్య వ్యాఖ్యానించారు. అంతకముందు గ్రాట్యుటీ చెల్లింపు బిల్లుకు రాజ్య సభ ఆమోదం తెలిపింది. సభ్యుల నిరసనల మధ్యే మూజువాణి ఓటు ద్వారా బిల్లును ఆమోదించారు. ఈ బిల్లును లోక్ సభ గత గురువారమే ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత బిల్లు చట్టరూపం దాల్చనుంది.