మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ప్రేమికులకి సహా అందరికే పరిచయం అక్కర్లేని పేరు. మిస్టర్ కూల్‌గా ప్రస్తుతం టీమిండియాకు పెద్ద దిక్కుగా ఉన్న ధోని జులై 7న తన 37వ పుట్టినరోజుని జరుపుకోనున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని పేరు తెచ్చుకున్నాడు. 1999-2000 సంవతర్సంలో తొలిసారిగా రంజీ మ్యాచ్ ఆడాడు. టీమ్ ఇండియా కెప్టెన్లలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచిన ధోని 2004లో చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ధోని కెప్టెన్సీలో భారత్ చిరకాలం గుర్తుండిపోయే విజయాలను సాధించింది.
2007లో జరిగిన తొలి ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌తోపాటు 2011లో వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సహా ధోని సారథ్యంలోని భారత జట్టు అనేక విజయాలు సాధించింది. ధోని సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు 18 నెలలపాటు టెస్టుల్లో నెంబర్ వన్‌గా నిలిచింది. క్లిష్టమైన సమయాల్లోనూ కూల్‌గా ఆలోచించే కెప్టెన్‌గా ధోనికి పేరుంది, అందుకే ఆయన్ని మిస్టర్ కూల్ అని పిలుస్తారు. ఐపీఎల్లో కూడా ధోని విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ధోని కెప్టెన్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని మూడు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా ధోని నిలబెట్టాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ స్టేజి వరకు ప్రతి సీజన్లో ఆడిన ఏకైక జట్టు చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఆ క్రెడిట్ మొత్తం ధోనికే దక్కుతుంది అనడంలో సందేహం లేదు. అందుకే ధోని మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకోవాలని ఆశిస్తూ.. హ్యాపీ బర్త్ డే కెప్టెన్ కూల్.