Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కెప్టెన్ గానూ, ఆటగాడిగానూ, మైదానంలో విభిన్నంగా ఉండే మహేంద్రసింగ్ ధోనీ పద్మ అవార్డుల కార్యక్రమంలో కూడా ప్రత్యేకంగా కనిపించాడు. సోమవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా మహేంద్రుడు పద్మభూషణ్ అందుకున్నాడు. ఈ సందర్భంగా ధోనీ వేసుకున్న డ్రెస్ అందరినీ ఆశ్చర్యపరిచింది. పద్మభూషణ్ అందుకునేందుకు ధోనీ ఆర్మీ డ్రెస్ లో వచ్చాడు. అంతేకాకుండా అవార్డు స్వీకరించేందుకు వెళ్లే క్రమంలో ధోనీ ఆర్మీ వ్యక్తిలా నడిచి వెళ్లి కోవింద్ కు సెల్యూట్ చేశాడు. దీంతో ఆ ప్రాంగణమంతా ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగిపోయింది. ఈ కార్యక్రమానికి ధోనీతో పాటు అతని భార్య సాక్షిసింగ్ కూడా హాజరయింది.
ఏడేళ్ల క్రితం… 2011 ఏప్రిల్ 2న ఫైనల్లో శ్రీలంకపై సిక్సర్ బాది టీమిండియాకు ప్రపంచకప్ అందించిన ధోనీ .మళ్లీ అదే రోజు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ స్వీకరించాడు. ప్రపంచకప్ విజయం తర్వాత ధోనీకి ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా దక్కింది. అందుకే పద్మభూషణ్ అందుకోవడానికి ధోనీ ఆర్మీ దుస్తుల్లో వచ్చాడు. ధోనీ పద్మభూషణ్ అందుకున్న సందర్బంగా ప్రస్తుత, మాజీ క్రీడాకారులు, అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. పద్మభూషణ్ అందుకున్న లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్రసింగ్ ధోనీకి అభినందనలని, ఏడేళ్ల క్రితం ఇదే రోజున మనం ప్రపంచకప్ గెలిచామని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ట్వీట్ చేశారు. ఏప్రిల్ 2,2011 – మహేంద్రసింగ్ ధోనీ భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఏప్రిల్ 2,2018-ధోనీ పద్మభూషణ్ అందుకున్నాడు. కంగ్రాట్స్ ధోనీ. ఎల్లప్పుడూ నువ్వు మాకు ఆదర్శంగా నిలుస్తావని ఢిల్లీ డేర్ డెవిల్స్ ట్వీట్ చేసింది. ప్రపంచకప్ ద్వారా ధోనీ ఎంతోమంది అభిమానుల సంబరాలకు కారణమయ్యాడని, ఏడేళ్ల తర్వాత అదే రోజు ధోనీకి సరైన గౌరవం దక్కిందని అభిమానులు కొనియాడారు.