తెలంగాణ సినిమా కొత్తదనం వైపు పరుగులు పెడుతుంది. దర్శక, నిర్మాతలు ప్రయోగాలకు వెనకాడటం లేదు. అందుకే కొత్త కథలని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కమర్షియల్స్, లాభాలు లెక్కలు వేసుకోకుండా ఒక బలమైన కథని చూపించడానికి ముందుకు వస్తున్నారు. అదే కోవలో వచ్చిన సినిమానే మల్లేశం. అమ్మ కష్టాన్ని చూడలేక, తన కుల వ్రుత్తి అయిన చేనేత పరిశ్రమకు వెన్నెదన్నుగా నిలిచి, ఆసు యంత్రాన్ని కనిపెట్టి, అందుకోసం తన జీవితాన్ని ధారబోసి ఎట్టకేలకి పద్మశ్రీ కూడా అందుకున్నచింతకింది మల్లేశం జీవిత కథకు సినిమా రూపే ఈ సినిమా. మరి ఆయన ఈ జీవిత కథ వీక్షకులకు ఎలా మెప్పించిందో తెలుసుకోవాలంటే రివ్యూ చదవాల్సిందే.
కధ:
మల్లేశం (ప్రియదర్శి) ఓ చేనేత కుటుంబానికి చెందిన యువకుడు. తల్లితండ్రులు రెక్కల కష్టంతోనే ఆ ముగ్గురి కడుపులు నిండుతాయి. అయితే ఆర్థిక కారణాల వల్ల ఆరో తరగతిలోనే ఎంతో ఇష్టమైనా మల్లేశం చదువు ఆగిపోతుంది. ఇంట్లోనే మగ్గం ఎక్కిన మల్లేశం ఓ చీర తయారు చేయడానికి అమ్మ పడుతున్న కష్టం చూసి తల్లడిల్లిపోతాడు. అమ్మకి కష్టం కలగకుండా సులభంగా నేత నేసేలా ఆసు యంత్రం కనుక్కోవాలనుకుంటాడు. అప్పులు చేసి మరీ కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేస్తాడు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా అనుకున్న గమ్యం చేరుకోలేకపోతాడు. ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు. మరి చివరికి మల్లేశం కథ ఏమైయింది? అనుకున్నది సాధించాడా? ఈ ప్రయాణంలో ఆయనకి ఎదురైనా సంఘనటనలు, సవాళ్లు ఏంటి? అనేదే ఈ సినిమా కధ.
విశ్లేషణ : ఇదో బయోపిక్ సాధారణంగా సమాజంలో బాగా పేరు ప్రఖ్యాతలు ఉండి, జీవితంలో విజేతలుగా నిలిచిన వారి కథలు బయోపిక్ లుగా వస్తాయి. కానీ ఒక వ్యక్తి గురించి పక్క ఊరి వాడికి కూడా సరిగ్గా తెలియని ఒక వ్యక్తి కథని బయోపిక్ గా తీయడానికి మాత్రం ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం మల్లేశం సినిమాతో చేసిన దర్శక నిర్మాతలకు, అలాగే ఈ కథని నమ్మి మల్లేశం పాత్ర వేసిన ప్రియదర్శి ధైర్యానికి ముందుగా హాట్సాఫ్ చెప్పాలి. ఫస్టాఫ్ అంతా మల్లేశం బాల్యం, యవ్వనం, పెళ్లి ఇవన్నీ సరదాగానే ఆడుతూ పాడుతూ సాగిపోతాయి. ఇక అదే సనయంలో తెలంగాణ పద్ధతులు, పెళ్లిళ్లు, సరదా సన్నివేశాలు చూపించారు. కానీ ఎప్పుడైతే ఆసు యంత్రం కనుక్కోవాలన్న తాపత్రయం మల్లేశంలో ఎక్కువ అవుతుందో అప్పుడే అసలు కథ మొదలౌతుంది. ద్వితీయార్ధం మొత్తం ఆసు యంత్రంపై మల్లేశం చేసే పోరాటమే కనిపిస్తుంది. మొదలుపెట్టిన ప్రతీసారి ఓటమి ఎదురౌతుంటుంది. ఈ క్రమంలో అనేక అవమానాలు. ఆఖరికి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో కూడా ఈ యంత్రం కోసం మాటలు పడాల్సిన పరిస్థితి. నిజానికి మల్లేశానికి యంత్రం కనుక్కునందుకే పద్మశ్రీ ఇచ్చారు, అందుకే ఆయన జీవుతం సినిమా అయ్యింది. అతడు ఆ యంత్రం కనుక్కుంటాడని అందరికీ తెలుసు. కానీ మల్లేశం ఓడిపోతున్న ప్రతిసారి ప్రేక్షకుడు కూడ ఓడిపోయిన భావనకి లోనౌతాడంటే సినిమా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా చూశాక.. ఒక చీర నేయడానికి ఇంత కష్టపడతారా ? అనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. కానీ తన బాద్యతను ఒక దర్శకుడిగా అదే సమయంలో నిర్మాతగా రెండు పడవల మీద కాలు పెట్టి కూడా సమర్ధవంతంగా నడిచారు రాజ్.
అయితే నటీనటుల విషయానికి వస్తే మల్లేశం పాత్రలో నటించిన ప్రియదర్శిని చూస్తే ఇప్పటిదాకా సినిమాల్లో చూసిన ప్రియదర్శి ఇతనేనా అనిపించక మానదు. ఇక ఈ సినిమా హీరోయిన్ అనన్య నాగళ్ల ఈమెకి ఇది మొదటి సినిమా అంటే నమ్మడం కష్టమే ఎందుకంటే అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్ ఐన నటులతో ఎంతో ఈజ్ తో నటించింది, ఇక ఝాన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు. అయితే ఆమె భర్తగా నటించిన ఆనంద్ చక్రపాణి అనే ఆయన నటన హైలైట్ గా చెప్పుకోవచ్చు, కొడుకు మీద నమ్మకం ఉన్నా సమాజానికి భయపడి తిడుతూ, ఆ కొడుకు విజయం సాధించాక ఆయన నటించిన తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక మల్లేశం స్నేహితులుగా నటించిన అన్వేష్, జగదీశ్ లు తెలుగు తెరకి దొరికిన మరో ఇద్దరు మంచి నటులని చెప్పచ్చు. ఇక మిగతా నటీనటులు తమ పాత్ర పరిది మేరకు మెప్పించారు.
ఫైనల్ గా : ఈ సినిమా మిస్ అవొద్దు…ఎందుకంటే అదొక జీవితం…
ఫైనల్ గా : స్పూర్తిని పెంచే మల్లేశం