Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేరళ దారుణంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ అమానవీయ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేరళలో చోరీలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ మానసిక స్థితి సరిగాలేని ఓ యువకుడిని కొందరు యువకులు కట్టేసి కొట్టి చంపేశారు. అంతేకాదు… అతడిని కొడుతూ వారు సెల్ఫీలు కూడా దిగారు. ఆ యువకుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా..అప్పటికే అతను మృతిచెందాడు. ఆ యువకుడి పేరు మధు అని దర్యాప్తులో తేలింది. దీనిపై ఇప్పటికే మలయాళ నటుడు మమ్ముట్టి స్పందించాడు.
చనిపోయిన యువకుడు ఆదివాసీ కాదని, తన సోదరుడులాంటి వాడని, దుండగులు తన సోదరుణ్ని చంపేశారని మమ్ముట్టి ఆవేదన చెందాడు. ఓ మనిషిగా ఆలోచిస్తే… చనిపోయిన మధు నిందితులకు కూడా సోదరుడిగా, కుమారుడిగా కనిపిస్తాడన్నారు. అతడు మనలాగే పౌరుడని, అతడికి కూడా హక్కులు ఉంటాయని, ఆకలి కోసం దొంగతనం చేసే వారిపై దొంగ అనే ముద్ర వేయకూడదని, పేదరికాన్ని సమాజమే సృష్టించిందని, భావోద్వేగంగా స్పందించాడు. కారణం ఏదైనా ఓ మనిషి మరో మనిషిపై దాడిచేయడం తప్పని, సారీ మధూ అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు మమ్ముట్టి. తాజాగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ దారుణంపై ఆవేదన వ్యక్తంచేశాడు. మధు ఒక కేజీ బియ్యాన్ని దొంగలించాడు. ఈ మాత్రం దానికి ఉబైద్, హుస్సేన్, అబ్దుల్ కరీమ్ ల గుంపు ఆ పేద గిరిజనుడిని చంపేసింది. అభివృద్ధి చెందిన సమాజానికి ఇదొక మచ్చ. ఇలాంటి సమాజంలో ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నా… అని ట్విట్టర్ లో స్పందించాడు సెహ్వాగ్.