Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చేసినవి తక్కువ సినిమాలే అయినా కూడా మెహర్ రమేష్‌ను సినీ వర్గాల వారు అంత త్వరగా మర్చిపోరు. ఈయన తీసిన సినిమాల్లో ఒకటి రెండు పర్వాలేదు అనిపించినా, ఇతర సినిమాలు నిర్మాతలను కోలుకోలేని దెబ్బ తీశాయి. ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘శక్తి’ చిత్రాన్ని నిర్మించినందుకు అశ్వినీదత్ అయిదు సంవత్సరాల పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెల్సిందే. ఆ తర్వాత వెంకటేష్‌తో ‘షాడో’ చిత్రాన్ని మెహర్ రమేష్ తెరకెక్కించాడు. ఆ సినిమా నిర్మాత ఎక్కడ ఉన్నాడో కనీసం షాడో కూడా కనిపించడం లేదు. అంతటి పేరున్న ఈ దర్శకుడితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు మరియు హీరోలు ఒణుకుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక మెగా హీరో మెహర్ రమేష్‌తో సినిమా చేసేందుకు ముందుకు వచ్చాడు అంటూ ప్రచారం జరుగుతుంది.
మెహర్ రమేష్ దర్శకత్వంకు దూరంగా ఉన్నా కూడా సినిమాలకు మాత్రం దూరంగా లేడు. ఇటీవల వచ్చిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల కథా చర్చల్లో మెహర్ పాలు పంచుకున్నాడు అనే విషయం తెల్సిందే. స్క్రిప్ట్ వర్క్‌లో స్టార్ దర్శకులు కూడా మెహర్ రమేష్‌ను ఆహ్వానించి, ఆయన్ను చర్చల్లో పాలు పంచుకునేలా చేస్తారు. అలా పలు సినిమాలకు స్క్రిప్ట్ సహకారం అందించిన మెహర్ రమేష్ ఇటీవల ఒక మంచి స్క్రిప్ట్‌ను సిద్దం చేశాడట. ఆ స్క్రిప్ట్‌ను మెగా హీరో వినడం, తప్పకుండా సినిమా చేద్దామని హామీ ఇచ్చాడని తెలుస్తోంది. అయితే మెహర్ రమేష్‌తో భారీ బడ్జెట్ పెట్టి సినిమాను నిర్మించేందుకు ఏ నిర్మాత కూడా సాహసం చేయడం లేదు. పది కోట్ల లోపు బడ్జెట్‌తో అయితే సినిమా నిర్మించేందుకు ఒక నిర్మాత సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే సంవత్సరంలో మెగా హీరో మెహర్ రమేష్ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే మెహర్ రమేష్‌తో సినిమా చేయడం అనేది సాహసమే అంటూ మెగా హీరోను హెచ్చరిస్తున్నారు. ఆ మెగా హీరో వరుసగా చిత్రాలు చేసుకుంటూ సక్సెస్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా దూసుకు పోతున్నాడు.