Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సాగిన తీరుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. ఏ అంశంపై చర్చ జరగకుండా పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడడంతో విపక్షాల తీరుకు నిరసనగా… ఒకరోజు నిరాహారదీక్ష చేయాలని మోడీ భావిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమైన మోడీ ఈ విషయంపై చర్చించారు. బీజేపీ ఎంపీలతో కలిసి ఈ నెల 12న దీక్ష చేయాలని నిర్ణయించారు. ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. పార్లమెంట్ ముగిసిన వారం రోజుల తర్వాత ప్రధాని నిద్రలేచారంటూ విమర్శలు గుప్పించింది. అటు… కాంగ్రెస్ చేపట్టిన నిరాహారదీక్షలకు ప్రతిగానే… మోడీ ఈ దీక్ష చేపట్టారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
టీడీపీ, వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరగకుండా ఉండేందుకు అన్నాడీఎంకే ఎంపీలతో కేంద్రప్రభుత్వమే ఆందోళన చేయించిందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకే మోడీ ఈ వ్యూహం రచించారని పలువురు విశ్లేషిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు దీక్షలు చేయడం సహజమే కానీ… విపక్షాల తీరుకు నిరసనగా… అధికార పార్టీ నేతలు దీక్షకు దిగడం విడ్డూరంగా ఉందన్న వ్యాఖ్యలూ వినపడుతున్నాయి.