నటీ నటులు : అఖిల్, నిధి అగర్వాల్ తదితరులు
సంగీతం : థమన్
ఛాయాగ్రహణం : జార్జ్ సి. విలియమ్స్
నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత : భోగవల్లి ప్రసాద్
కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం: వెంకీ అట్లూరి
హలో సినిమా తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకొని అఖిల్ చేసిన సినిమా మిస్టర్ మజ్ను. ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అక్కినేని వారసుడు. ప్రస్తుతం ఉన్న యువ హీరోల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సరైన హిట్ దొరకాల్సిన హీరోల్లో అక్కినేని వారసుడు అఖిల్ కూడా ఒకరు. అలాగే తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఇప్పుడు అఖిల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించికోడానికి బాక్సాఫీక్ దగ్గరకి వచ్చారు..మరి వెంకీ అట్లూరి అయినా అఖిల్ కు సరైన హిట్ ఇచ్చారో లేదో అఖిల్ ఆశలు ఎంతవరకు నెరవేరాయో చూద్దాం.
కథ:
విక్కీ (అఖిల్) చదువుకోసం లండన్ వెళ్లి ప్లేబాయ్‌గా అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటాడు. లండన్‌లోనే బాబాయ్ (సుబ్బరాజు) ఇంట్లో ఉంటూ చదువుకుంటుంది నిక్కీ(నిధి అగర్వాల్). విక్కీ ప్లేబాయ్ అని తెలుసుకున్న నిక్కీ మొదట్లో అతన్ని అసహ్యించుకుంటుంది. అయితే అతని మనసుని అర్ధం చేసుకున్న నిక్కీ విక్కీ ప్రేమలో పడుతుంది. నిక్కీ ప్రేమను అర్ధం చేసుకోలేకపోయిన విక్కీ ఆమె అతి ప్రేమను భరించలేక దూరం చేసుకుంటాడు. అయితే నిక్కీ దూరమైన తరువాత ఆమె ప్రేమను తెలుసుకుని ఆమె కోసం తిరిగి లండన్ వెళతాడు. ఇంతకీ నిక్కీ ప్రేమను విక్కీ ఎలా పొందుకున్నాడు? విక్కీకి ఎదురైన ఇబ్బందులు ఏంటి? అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ :
ఓటమి నుండి పాఠం నేర్చుకోవాలని అఖిల్ ఎంత ప్రయత్నిస్తున్నారిజల్ట్ మాత్రం మారడం లేదు. ‘అఖిల్’, ‘హలో’ చిత్రాలతో హిట్ దాహం తీర్చుకోలేకపోయిన అఖిల్ ‘Mr మజ్ను’ అంటూ ప్లేబాయ్ అవతారంలో ప్రేక్షకుల్ని పలకరించారు. ‘తొలిప్రేమ’ చిత్రంతో సెన్సిబుల్ హిట్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రాముడి లాంటి వాడు మొగుడిగా కావాలనుకునే హీరోయిన్. ఆడ వాసన తగిలితే ఈడున్నా అంటూ ఎటువంటి అమ్మాయినైనా ఇట్టే పడేసే ప్లేబాయ్ హీరో. ఈ ఇద్దరి మధ్య రొమాంటిక్ ప్రేమకథే ‘Mr మజ్ను’. రాముడి లాంటి వాడు కావాలనుకునే హీరోయిన్ క్రిష్ణుడు ప్రేమలో పడటం. ఆ ప్రేమ రామున్ని ఎలా చేసింది అనేదే ‘Mr మజ్ను’.
కథనం:
తొలిప్రేమ లాంటి సినిమా తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కించిన సినిమా కావడంతో మిస్టర్ మజ్ను ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అఖిల్ కూడా పూర్తి స్థాయి ప్రేమ కథ చేయడంతో అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. వాళ్ళ అంచనాలు నిలబెట్టేలా ఫస్టాఫ్ నడిపించాడు దర్శకుడు వెంకీ అట్లూరి. కొంతమందికి ప్రేమను తీసుకోవడమే తప్ప ప్రేమను ఇవ్వడం తెలియదు, ఇంకొంతమందికి ప్రేమను ఇవ్వడంతో పాటు తీసుకోవడం కూడా రాదు. కాని ప్రేమను పంచే వాళ్లు దూరమైతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ‘Mr మజ్ను’ ద్వారా చూపించారు దర్శకుడు. ద్వితీయార్ధంలో తేలిపోయారు. ప్రీ ఇంటర్వెల్ సీన్‌తో కథపై ఇంట్రస్ట్ కలిగేలా చేసినా ఆ ఫ్లో కంటిన్యూ చేయలేకపోయారు. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కథ లండన్ షిఫ్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి కాస్త తడబడ్డాడు వెంకీ అట్లూరి. దీంతో ప్రేక్షకుడికి కొత్త కథను చూస్తున్నామనే ఫీల్ కలగకపోగా సెకండాఫ్‌లో వచ్చే సాగదీత సీన్లు విసుగుపుట్టించాయి. క్లైమాక్స్ ఏమవుతుందో ముందే తెలిసిపోవడంతో స్క్రీన్ ప్లే తేలిపోయింది. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా క్యారీ చేయగలిగాడు దర్శకుడు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో రావు రమేష్ అఖిల్ మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశం కళ్ళు చెమర్చేలా చేసింది. సెకండాఫ్ చాలా వరకు హైపర్ ఆది, ప్రియదర్శి కామెడీతో చాలావరకు కవర్ చేశాడు వెంకీ అట్లూరి. ఓవరాల్ గా మిస్టర్ మజ్ను యావరేజ్ గానే కనిపిస్తుంది, సీన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్న వెంకీ అట్లూరి సెకండ్ హాఫ్ విషయంలో కూడా ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటె కచ్చితంగా తొలి ప్రేమ కంటే పెద్ద విజయం సాధించేది. అయినా కూడా ఇప్పటి జనరేషన్ కి తగ్గట్లుగా వారి ఆలోచన శైలి కి దగ్గరగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వెంకీ అట్లూరి.
నటీనటులు:
అయితే అఖిల్ మాత్రం తన గత చిత్రాలకంటే ఈ సినిమాలో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చారు. అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. నటన పరంగా చాలా పరిణితి చెందాడు. ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. అఖిల్, నిధి మధ్య రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఎమోషన్స్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కామెడీ పరంగా ప్రియదర్శి, హైపర్ ఆదిలు బాగా నవ్వించారు. అఖిల్ తో ప్రియదర్శి ‘హలో బ్రదర్’ కామెడీ ట్రాక్‌కి బాగా పండింది. ఇక లండన్‌లో సినిమాలను పైరసీ చేసే హైదరాబాద్ ర్యాకర్స్ గా హైపర్ ఆది.. కామెడీని పండిస్తూనే మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ సినిమాలో నటించిన నాగేంద్రబాబు, రావు రమేష్, సుబ్బరాజు, జయప్రకాష్, పవిత్ర, సితార, విద్యుల్లేఖ రామన్‌లు పరిధి మేర పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ టీం:
తమన్ మరోసారి ఆకట్టుకున్నాడు. ఇక ఈ చిత్రానికి తమన్ మంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి తన మార్క్ చూపించారు. మిస్టర్ మజ్ను టైటిల్ సాంగ్‌తో పాటు ‘ఏమైందో’ ఎమోషనల్ సాంగ్ బాగున్నాయి. జార్జ్ విలియమ్ సన్ సినిమాటోగ్రఫీతో ఆకట్టుకున్నారు. అఖిల్, నిధి అగర్వాల్‌లను అందంగా చూపించారు. లండన్ లొకేషన్లను బాగా చూపించారు. నవీన్ నూలి ఎడిటింగ్ ఈ సినిమాకి ప్లస్ కాలేకపోయింది. సెకండాఫ్‌లో చాలా సీన్లకు కత్తెర వేయాల్సిఉంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడిగా వెంకీ అట్లూరి చాలా వరకు సక్సెస్ అయ్యాడు.
చివరగా
మిస్టర్ మజ్ను జస్ట్ లో మిస్