అన్ని ఛాలెంజ్‌ల క‌న్నా ఈ ఛాలెంజ్ మేల‌యా..!

nag ashwin one bucket challenge

సోష‌ల్ మీడియాకి ప్రాముఖ్య‌త పెరిగిన‌ప్ప‌టి నుండి అనేక‌ ఛాలెంజ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఐస్‌ బ‌కెట్ ఛాలెంజ్‌, రైస్ బ‌కెట్ ఛాలెంజ్‌, బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ఇలా ప‌లు ర‌కాల ఛాలెంజ్‌లు వ‌చ్చాయి. కాని వీటికి భిన్నంగా ప్ర‌స్తుత పరిస్థితుల‌ని బ‌ట్టి మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు వ‌న్ బ‌కెట్ ఛాలెంజ్ చేశాడు. ప్ర‌స్తుతం భార‌త భూగ‌ర్భ జలాలు అడుగంటి పోతుండ‌డంతో అనేక ప్రాంతాల ప్ర‌జ‌లు నీటి కోసం ముప్పు తిప్ప‌లు ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య రానున్న రోజుల‌లో హైద‌రాబాద్‌కి కూడా రానుంది. ఇలాంటి ప‌రిస్థితి రాకూడదంటే నీటిని ఆదా చేయ‌డం ఒక్క‌టే మార్గం. అందుకే మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కాస్త విభిన్నంగా ఆలోచించి వ‌న్ బ‌కెట్ ఛాలెంజ్ చేశారు. కనీసం ఒక్కరోజైనా కేవలం ఒక బకెట్ నీటిని మాత్రమే ఉపయోగించి దిన చర్య ముగించాలని పిలుపునిస్తున్నారు.

దిన‌చర్య‌లైన బ్ర‌ష్‌, బాత్, టాయిలెట్‌, హ్యాండ్ వాష్ ఇలా అన్ని అవ‌స‌రాలని కేవ‌లం ఒక్క బ‌కెట్ నీటితో మాత్ర‌మే తీర్చుకోవాల‌ని ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. జూలై 21 అనగా ఈ ఆదివారం కేవలం ఒక బకెట్ నీటిని మాత్రమే ఉపయోగించి మీ సామాజిక బాధ్యత నెరవేర్చమ‌ని కోరుతున్నాడు నాగ్ అశ్విన్. మ‌రి మంచి ప‌నికోసం నాగ్ అశ్విన్ చేసిన ఛాలెంజ్‌ని ఎంత మంది స్వీకరిస్తారో చూడాలి. నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన మ‌హాన‌టి చిత్రం సావిత్రి జీవిత నేపథ్యంలో తెర‌కెక్క‌గా ఈ చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో మ‌నంద‌రికి తెలిసిందే.