ప్రణయ్ హత్యకు అసలు కారణం అదే !

Nalgonda SP Ranganath on Pranay Murder Case

లేకలేక పుట్టిన బిడ్డను కంటికిరెప్పలా చూసుకుంటూ పెంచుకున్న తరుణంలో ఆమె తమను కాదని మరో యువకుడితో వెళ్లిపోయిన నేపథ్యంలో, బిడ్డపై ఉన్న అతి ప్రేమ, ఆమె తనకు కావాలన్న బలమైన కోరికతోనే అమృత వర్షిణి భర్త ప్రణయ్ ను చంపించాలని మారుతీరావు హత్యకు పాల్పడ్డాడని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ ప్రకటించారు. ఈ కేసులో ఏ1 నిందితుడు మారుతీరావేనని, మరో ఆరుగురు నిందితులు ఉన్నారని ఆయన అన్నారు. ఈ హత్యకు మాజీ ఉగ్రవాది మహ్మద్‌ అబ్దుల్‌ బారీతో కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడని బారీ తన గురువు లాంటి అస్గర్‌ అలీతో ప్లాన్‌ చేసి బిహార్‌ లోని సంస్థాన్‌ పూర్‌ జిల్లాకు చెందిన శర్మను ఈ ఆపరేషన్‌ కు వినియోగించాడని ఆయన అన్నారు.

maruthirao And Brother

బిహార్‌ లో అదుపులోకి తీసుకున్న శర్మను పోలీసులు మిర్యాలగూడకు తీసుకువస్తున్నారు. బీహార్ లో ఫ్లైట్ మిస్ కావడంతో కాస్త ఆలస్యంగా మిర్యాలగూడకు తీసుకువస్తున్నామన్న పోలీసులు..సాయంత్రానికి మిర్యాలగూడ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. హత్య జరిగిన రోజు శర్మతో పాటే అస్గర్‌ ఆసుపత్రికి వచ్చినట్టుతెలుస్తోంది. తన కూతురు ఆరోగ్యం బాగాలేకపోవడంతో అస్గర్‌ డబ్బు కోసం ఈ డీల్‌ ఒప్పుకున్నట్టు సమాచారం. హత్య చేస్తే రూ. కోటి రూపాయలు ఇచ్చేలా డీల్ మాట్లాడుకున్న మారుతీరావు, అడ్వాన్సుగా రూ. 18 లక్షలు ఇచ్చాడని అవతలి వ్యక్తి ధనవంతుడు కావడం వల్లే, హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ ఇంత భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిందని, అందుకు మారుతీరావు కూడా అంగీకరించాడని రంగనాథ్ తెలిపారు.

pranay-murder-case

ఈ కేసును మూడు రోజుల్లోనే ఛేదించామని, స్క్రీన్ మీద కనిపిస్తున్న పాత్రధారి ఒకరేనని, దీని వెనుక చాలా మంది ఉన్నారని అన్నారు. ఈ కేసులో అమృత వర్షిణి ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, నయీమ్ గ్యాంగ్ ల ప్రమేయంపై, విచారణ జరిపిస్తామని అన్నారు. వేముల వీరేశం గత జనవరిలో అమృత మామ బాలస్వామిని బెదిరించినట్టు తమ వద్ద ఫిర్యాదు ఉందని, అందువల్లే అమృత ఆయన మీద ఆరోపిణ చేసి వుండవచ్చని రంగనాథ్ అభిప్రాయపడ్డారు. ఆమె ఫిర్యాదు చేస్తే, కేసు రిజిస్టర్ చేసి, వీరేశాన్ని విచారిస్తామని కానీ తమ ఈ మూడు రోజుల విచారణలో మాత్రం వీరేశం ప్రమేయంపై ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని అన్నారు.