తనకు టికెట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటానని కేసీఆర్ ను హెచ్చరించిన చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే చివరాకరికి కేసీఆర్ కు జై కొట్టారు. చెన్నూరు టిక్కెట్ కేటాయింపు విషయంలో టీఆర్‌ఎస్ పార్టీలో తలెత్తిన గ్రూప్ వార్ కు ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెరదించారు. చెన్నూరు టికెట్ పెద్దపల్లి ఏంపీ బాల్క సుమన్‌కు కేటాయించటంతో ఓదేలు అనుచరులు తీవ్ర అసంతృప్తితో బుధవారం బాల్క సుమన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం సందర్భంగా ఓదేలు అనుచరుడు గట్టయ్య పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో 16 మంది గాయపడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఓదెలు ని పిలిపించుకున్న కేసీఆర్‌తో దాదాపు గంట పాటు చర్చలు జరిపారు. దీంతో టికెట్ విషయంలో రాజీ పడేదే లేదని.. సుమన్‌పై ఎంత దాకైనా పోరాడుతానని సుమన్ చరిత్రేంటో త్వరలోనే టీఆర్ఎస్ అధినేత ముందు పెడతానని బీరాలు పలికిన ఓదెలు కేసీఆర్ బుజ్జగింపుకి లొంగిపోయారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. అధినేత మాటే తనకు శిరోధార్యమని పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని ఓదేలు పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థి గెలిస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కార్యకర్తలకు ఆయన సూచించారు.