Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ కంచుకోటలు బద్దలు అవుతున్నాయి. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రాకపోయినా ప్రకాశం జిల్లా సగం నుంచి మొదలుకుని నెల్లూరు, కడప, కర్నూల్, చిత్తూర్ జిల్లాల్లో మంచి ఫలితాలు సాధించింది. 2019 ఎన్నికలకి వచ్చేసరికి నాడు బలహీనంగా వున్న స్థానాల్లో బలపడడం మాట అటుంచి అప్పట్లో కంచుకోటలు అనుకున్న చోట కూడా బలహీనపడుతూ వస్తోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేయడంతో ఆ జిల్లాలో వైసీపీ బలం నామమాత్రం అయిపోయింది. ఇక నెల్లూరు జిల్లాలో కూడా అదే పరిస్థితి రాబోతోందా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు క్షేత్ర స్థాయిలో వైసీపీ కి వున్న బలాన్ని దృష్టిలో ఉంచుకుని మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే ఆ జిల్లా నుంచి వలసలు తక్కువగానే కనిపించాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు వైసీపీ లోకి పెద్ద సంఖ్యలో జంప్ అయ్యారు. వారిలో టీడీపీ అధినేత చంద్రబాబుని తెగ విమర్శించినవారిలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముఖ్యులు. 2009 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే వై,ఎస్ ని పొగుడుతూ బాబుని తిడుతూ తన రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతోందో చెప్పారు. అలాగే చేశారు. అయితే వైసీపీ లో బాధ్యతలు తప్ప భవిష్యత్ లేదు అనే విషయం ఆయనకి అర్ధం అవుతూ వస్తోంది. అయితే వేరే దారిలేక ఆ పార్టీలోనే వుంటూ వచ్చారు. అటు 2019 ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఇక ఏదో ఒక దారి చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నట్టు నెల్లూరు జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయం మీద ఓ మంత్రిని కూడా కలిసినట్టు తెలుస్తోంది. అవసరం అయితే చంద్రబాబుకి, టీడీపీ కి సారీ చెప్పడానికి కూడా సిద్ధమని పార్టీ లో చేర్చుకోవాలి నల్లపురెడ్డి ఆ మంత్రి దగ్గర ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన చంద్రబాబు చూద్దాం అన్న ధోరణిలో ఉంటే జిల్లాకి చెందిన టీడీపీ శ్రేణులు మాత్రం గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని పార్టీలోకి ఆయన్ని రానివ్వొద్దని గట్టి పట్టు పడుతున్నారు. ఈ ఎపిసోడ్ చూస్తే చాలదా నెల్లూరు జిల్లాలో టీడీపీ భవిష్యత్ ఏమిటో చెప్పేందుకు.