టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తెలుగు మరియు తమిళంలో ఒకేసారి చేసిన ‘యూటర్న్’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండు భాషల్లో కూడా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై సమంత చాలా ఆశలు పెట్టుకుంది. కన్నడంలో సూపర్ హిట్ అయిన యూటర్న్ చిత్రానికి ఇది రీమేక్. కన్నడం యూటర్న్‌కు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి దర్శకుడు పవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. తెలుగు మరియు తమిళంలో విభిన్నమైన స్క్రీన్‌ప్లేలతో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ చిత్రం విడుదల విషయంలో ఒక సెంటిమెంట్ సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆ చర్చ ఇప్పుడు యూటర్న్ యూనిట్ సభ్యులకు కలవర పెడుతోంది.
తెలుగులో ఇప్పటి వరకు పలు కన్నడ సినిమాలు రీమేక్ అయ్యి వచ్చాయి. కన్నడలో మంచి విజయాన్ని సాధించిన ఎన్నో చిత్రాలను తెలుగులో రీమేక్ చేయగా ఫలితం చేదుగానే మిగిలింది. ఫలితంను పట్టించుకోకుండా వరుసగా కన్నడ సినిమాలు రీమేక్ అవుతూనే ఉన్నాయి. కాని ఫలితం మాత్రం ఒకటే వస్తుంది. దాంతో కన్నడ సినిమాలు తెలుగులో సక్సెస్ కావు అనే టాక్ ఉంది. ఇలాంటి సమయంలో కన్నడ యూటర్న్‌ను తెలుగులో రీమేక్ చేసిన సమంత ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో అనే ఆందోళన సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.
ఈ సినిమాకు సమంత నిర్మాతగా కూడా వ్యవహరించినట్లుగా సమాచారం అందుతుంది. ఇక యూటర్న్ చిత్రం విషయంలో వస్తున్న నెగటివ్ కామెంట్స్ మరియు సెంటిమెంట్ వార్తలను సమంత కొట్టి పారేస్తోంది.