మహాకూటమిలో సీట్ల సర్ధుబాటు కొలిక్కి వచ్చినా అసంతృప్తులు మాత్రం చల్లబడడంలేదు. దీంతో ఆయా పార్టీల అధిష్ఠానాలు రంగంలోకి దిగుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన కొందరు నేతలు రెబెల్స్‌గా నామినేషన్ వేసిన నేపథ్యంలో వారందరినీ బుజ్జగించే ప్రయత్నాలను ముమ్మరం చేయగా చాలా వరకూ నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. ప్రజాకూటమిలో ఏ పార్టీకి కేటాయించిన స్థానాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారం కొనసాగిస్తున్నారు.అయితే, కొన్ని చోట్ల రెండు పార్టీలు బీపామ్‌లు ఇవ్వడంతో ఫ్రెండ్లీ పోటీ ఉంటుందని ఆయా పార్టీలు చెబుతున్నాయి. ఇలాంటివి కూటమి ధర్మాన్ని దెబ్బతీస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న వేళ ఆయా పార్టీలు నిర్ణయాన్ని మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఓ టీడీపీ అభ్యర్థికి కొత్త టెన్షన్ వచ్చి పడింది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేతేనని సమాచారం. ప్రజాకూటమి పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన స్థానాల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం ఒకటి. ఇక్కడి నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వర్రావు పోటీ చేస్తున్నారు. ఈయనకు టీడీపీ నేతల మద్దతు పాటు, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి అండదండలు ఉన్నాయి. దీంతో ఆయన విజయం సాధించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వల్ల కొత్త టెన్షన్ స్టార్ట్ అయిందని ప్రచారం జరుగుతోంది. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, పీసీసీ సభ్యుడి నుంచి అన్ని హోదాల్లో పనిచేసిన నాయకుడిగా, ఆలిండియా యూత్‌కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఎనిమిదిన్నరేళ్లు ఏఐసీసీ సెక్రటరీగా పనిచేసిన తనకే అసెంబ్లీ టికెట్ కేటాయింపులో అన్యాయం జరిగిందనే అవమానంతో ఆయన సతమతమవుతున్నట్టు తెలుస్తోంది.35 ఏళ్ల నుంచి పార్టీకి చేస్తున్న సేవను గుర్తించకుండా పొత్తు పేరుతో పొంగులేటి ఆశించిన ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని దక్కకుండా కొందరు టీపీసీసీ పెద్దలు కుట్ర చేశారనే భావనలో ఆయన అనుచరులు, సన్నిహితులు ఉన్నారు.
2014 ఎన్నికల సమయంలో సీపీఐతో, ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుని పొంగులేటికి టికెట్ రాకుండా చేశారని చెబుతున్నారు. పార్టీలో పదవులు రాకుండా అడ్డుకున్న నేతలే ఇప్పుడు కూడా ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారని ఆరోపిస్తున్నారు. పథకం ప్రకారమే టీపీసీసీ ముఖ్యులు ఇదంతా చేశారని భావిస్తున్న పొంగులేటి వర్గీయులు పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, పొంగులేటిని బుజ్జగించేందుకు గత 2 రోజులుగా ఏఐసీసీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. నేరుగా రాహుల్‌గాంధీతో సంబంధాలున్న ఆయనకు పార్టీలో అన్యాయం జరగకుండా చూస్తామని, భవిష్యత్తులో ఆయన సేవలను కీలకంగా ఉపయోగించుకుంటామని హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. కానీ టికెట్ దక్కిని కారణంగా నామాను ఓడిస్తామని ఆయన అనుచరులు అంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.