యావత్ దేశాన్ని షాక్‌కి గురిచేసిన బురారీ సామూహిక ఆత్మహత్యల కేసు కొత్త మలుపు తిరిగింది. మిస్టరీగా మారిన ఈ వ్యవహారంలో అసలు విషయాన్ని ఛేదించడంలో విఫలమవుతున్నారు పోలీసులు. కేసులో ఓ నిర్ధారణకు వచ్చే లోపే రోజుకో కొత్త విషయం వెలుగులోకి రావడంతో దర్యాప్తు ఆగిపోతోంది. లేటెస్ట్‌గా మరో విషయం వెలుగులోకి వచ్చింది. భాటియా ఇంటికి ఎదురుగావున్న హౌస్‌లో సీసీటీవీలో రికార్డయిన ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇందులో భాటియా ఫ్యామిలీ ఆత్మహత్యకు ఏర్పాట్లు చేసుకున్నట్లు ఎదురింట్లో రికార్డయిన సీసీటీవీలో ఫుటేజ్‌లో వెలుగుచూసింది. దానిని ఓ జాతీయ మీడియా బుధవారం రాత్రి ప్రసారం చేసింది.
అందులో.. భాటియా కుటుంబ పెద్ద కోడలు రాత్రి పది గంటల సమయంలో బయటి నుంచి ఇంట్లోకి ప్లాస్టిక్ స్టూళ్లు తీసుకెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత 20 నిమిషాలకు టీనేజర్లు ఇద్దరు పూజ కోసం ప్లైవుడ్ షాపు నుంచి వైర్లు తీసుకొచ్చారు. అలాగే రాత్రి 10.35 గంటలకు డెలివరీ బాయ్ తెచ్చిన ఫుడ్ పార్సిల్‌ను లలిత్ భాటియా కుమారుడు సుభమ్ అందుకున్నట్టు అందులో రికార్డయ్యింది. అనంతరం అతడే ఇంటి కింద ఉన్న తమ ఫర్నిచర్ దుకాణం నుంచి ఎలక్ట్రిక్ వైర్ బండిల్‌ను 10.39 గంటలకు తీసుకొచ్చినట్టు స్పష్టమైంది. ఇక 10.57 నిమిషాలకు భవ్‌నేశ్ తమ కుక్కపిల్లను వాకింగ్ కోసం బయటకు తీసుకెళ్లాడు. అతను 11.04 గంటలకు తిరిగి వచ్చి షాపు తాళాలను పరిశీలించి టెర్రస్‌పైకి వెళ్లి కుక్కను అక్కడే కట్టేసినట్టు సీసీటీవీలో నిక్షిప్తమయ్యింది. ఇక ఆ తర్వాత కొన్ని గంటల పాటు భాటియా ఫ్యామిలీ కదలికలు ఏమీ కనబడలేదు. వీరంతా రాత్రి 12.45 నుంచి 1 గంట మధ్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ కూడా వీరు 1 గంటకు మృతిచెందినట్టు తెలియజేస్తోంది.
అలాగే తండ్రి తనకు ఇస్తున్న ఆదేశాలను కుటుంబ సభ్యులతో తరచూ చెప్పేవాడని ఇంట్లో దొరికిన డైరీల్లో రాసి ఉంది. నిజానికి వారంతా చనిపోతామని భావించి ఆత్మహత్యలకు పాల్పడలేదని, తండ్రి వచ్చి రక్షిస్తాడని చివరి వరకు విశ్వసించినట్టు డైరీలోని రాతల ద్వారా తెలుస్తోంది. ఆత్మహత్యలకు పాల్పడినట్టు చేయడం ద్వారా భవిష్యత్ బాగుంటుందని, మంచి జరుగుతుందని, అతీత శక్తులు సిద్ధిస్తాయని లలిత్ తన డైరీలో రాసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ‘ఒక కప్పులో నీరు ఉంచండి.. నీటి రంగు నీలం రంగులోకి మారిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని కాపాడతాను’ అని రాసి ఉంది. ఆ రాత్రే వారు ఆత్మహత్యలు చేసుకున్నారు.
తాము చనిపోతామని వారికి తెలియదని లలిత్ భాటియా తండ్రి వచ్చి తమను కాపాడతాడనే ఉద్దేశంతోనే వారంతా సామూహిక ఆత్మహత్యలకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. భాటియా ఇంటికి సమీపంలోని 16 సీసీటీవీ ఫుటేజ్‌లను సైతం పోలీసులు పరిశీలించగా, వారికి ఎలాంటి ఆధారాలు కనిపించలేదు. బయటకు వ్యక్తులు ఆ ప్రాంతంలో సంచరించిన దాఖలాలు కూడా లేవు. జులై 1 ఉదయం 5.56 నిమిషాలకు భాటియా ఇంట్లో ఉన్న కిరాణ షాపు ముందు పాల ప్యాకెట్లను వదిలివెళ్లారు. కానీ ఆ ప్యాకెట్లను తీసుకురావడానికి ఎవరూ రాలేదు. అయితే ఉదయం 7.14 నిమిషాలకు ఓ వ్యక్తి పాల ప్యాకెట్ల కోసం భాటియా షాపుకు వచ్చాడు. ప్యాకెట్లు బయటే ఉండడం చూసి అతడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో వేలాడుతున్న శరీరాలను చూసి అతను షాక్ అయ్యాడు. దీంతో ఈ విషయం వెలుగుచూసింది. పోలీసుల దర్యాప్తులో ఇప్పుడీ ఫుటేజీలు కీలకం కానున్నాయి.